టీటీడీ లడ్డూ కల్తీ పిటిషన్ తిరస్కరణ
TTD laddu kalti petition rejected
ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలా?
ప్రసాదాల తయారీ అంతర్గతంగా ఆలయాల కమిటీయే పర్యవేక్షించాలి
సుప్రీంకోర్టు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. శుక్రవారం కల్తీపై సీబీఐ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్ లను సుప్రీం తోసిపుచ్చింది. పిటిషనర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటే దేవాలయాలు, గురుద్వారాలు, మిగతా ప్రార్థనా స్థలాల కోసం ప్రత్యేకంగా ఓ విభాగాన్నే ఏర్పాటు చేయాల్సి ఉంటుందని సుప్రీం జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది.
లడ్డూ కల్తీపై గ్లోబల్ పీస్ ఇనీషియేటివ్ అధ్యక్షుడు కెఎ పాల్, బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి తదితరులు పిటిషన్ దాఖలు చేసి సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 30న లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దేవుడిని రాజకీయాలకు దూరంగా ఉంచాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఆదేశించింది. ఆయన చేసిన ప్రకటనపై పలు ప్రశ్నలు సంధించింది. దీంతో ఈ వివాదంపై ఏపీ ప్రభుత్వం, వివిధ రాజకీయ పార్టీలు వెనక్కు తగ్గాయి.
కల్తీపై నివేదికను పరిశీలిస్తే ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించరా? లేదా? అన్నది స్పష్టంగా తెలియదని పేర్కొంది. ఆలయ నిర్వాహకులపై పలు ప్రశ్నలు సంధించింది. దీనిపై ఆలయ కమిటీ విచారణ చేయాల్సి ఉండగా కల్తీ అని ఆధారాలు ఎక్కడ ఉన్నాయని కోర్టు పేర్కొంది. ప్రసాదాల నాణ్యతను అంతర్గతంగా ఆలయ కమిటీ పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. దీంతో టీటీడీ లడ్డూ వివాదం సద్దుమణిగినట్లేనని భావిస్తున్నారు.