సోపోర్ లో ఎన్ కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదులు హతం
Two terrorists killed in encounter in Sopore
శ్రీనగర్: సోపోర్ లో సీఆర్పీఎఫ్ బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వీరి గురువారం రాత్రి నుంచి చాందీపూరాలోని ఒక రేకుల షెడ్డు కింద దాగి భద్రతా బలగాలపై కాల్పులకు తెగబడుతున్నారు. శుక్రవారం సాయంత్రం వీరిద్దరిని భద్రతా బలగాలు డ్రోన్ కెమెరా సహాయంతో గుర్తించి ఎన్ కౌంటర్ చేశాయి. వీరి వద్ద నుంచి భారీగా ఆయుధాలు లభించినట్లు సోపోర్ ఎస్పీ దివ్య తెలిపారు. సుమారు ఆకాశంలో మూడుకిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్ ఉగ్రవాదుల వీడియోలు, ఫోటోలను స్పష్టంగా చూసిన భద్రతా బలగాలు ఆపరేషన్ ను ప్రారంభించాయి. డ్రోన్ వైపు చూస్తూ ఉగ్రవాదులు నక్కే ప్రయత్నం చేశారు. కానీ బలగాల కంటికి చిక్కి ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. ఉత్తర కశ్మీర్ లోని కొండప్రాంతాల నుంచి చొరబడి విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. చలితీవ్రత పెరగడంతో వీరు కొండ ప్రాంతాల నుంచి కిందకు వచ్చి అటవీ ప్రాంతాల్లో నక్కి దాడులకు తెగబడుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది కొండ ప్రాంతాలపై నిఘాను పటిష్టం చేసింది. అదే సమయంలో ఉత్తర కశ్మీర్ లో ఉగ్రవాదులు చొరబడుతున్న పలు మార్గాలను గుర్తించి వాటిపై నిఘాను పటిష్టం చేసింది. ఒక ఉగ్రవాది పాక్ కు చెందిన వాడు కాగా, మరొకరు జమ్మూకశ్మీర్ కు చెందినవాడని ఎస్పీ దివ్య తెలిపారు.