వాషింగ్టన్ డీసీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 267 ఎలక్టోరల్ ఓట్లను సాధించారు. ట్రంప్ విజయం సాధించినట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు కమలా హారీస్ 224 ఓట్ల వద్ద పరిమితమయ్యారు. దీంతో ఇక ట్రంప్ ఎన్నిక లాంఛనమేకానుంది.
ఓటింగ్, లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ముగిశాక ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేస్తారు. ఓట్లను ఎలక్టోరల్ కాలేజీకి పంపేముందు యూఎస్ రాష్ర్టాల సెలెక్టర్లు డిసెంబర్ 11న సమావేశమవుతారు. అనంతరం నూతనాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సెలెక్టర్లు తమ తమ రాష్ర్టాల నుంచే రాష్ర్టపతి, ఉపరాష్ర్టపతిని ఎన్నుకొని వాషింగ్టన్ డీసీకి పంపుతారు. జనవరి 6న యూఎస్ కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కిస్తుంది. 538 ఓట్లలో 270 ఓట్లను దాటిన అభ్యర్థి పేరును నూతన అధ్యక్షుడిగా ప్రకటిస్తారు. దీంతో అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జనవరి 20న చేస్తారు.