ప్రతిపక్షాలకు అన్నామలై దడ
ప్రచార పర్వంలో ఒంటరి పోరాటం కేంద్ర పథకాలపై ప్రజలకు వివరణ స్థానిక పార్టీలకు ఎప్పటికప్పుడు ఇరకాటం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో ఈయన ప్రచారశైలితో నూతనోత్సాహం
చెన్నై: తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే, కాంగ్రెస్, కూటమి పార్టీలకు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దడ పుట్టిస్తున్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో మోదీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి నినాదాలు, అవినీతి, అక్రమాలను నిలదీస్తూ తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఈయన విమర్శలు, ఆరోపణలు, నిజాల ధాటికి ప్రతిపక్ష నాయకులు బెంబేలెత్తిపోతున్నారు. అధిష్టానాలతో అన్నామలైను ఎదుర్కోవడం ఎలా? అనే దానిపై సమాలోచనలు కూడా సాగుతున్నట్లు తెలుస్తోంది.
తమిళనాడులోని అవినీతి, అక్రమాలను ఎండగడుతూ స్టాలిన్ కు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. దీన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు. అదే విధంగా వీరి హయాంలో జరిగిన ప్రతీ పనికి సంబంధించిన వివరాలతో డేటాను రూపొందించుకొని అందులోని కేంద్రం వాటాను ప్రజలకు అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నారు. దీంతో ఇన్నిరోజులు స్థానిక ప్రభుత్వమే తమకు ఈ పథకాలను అందిస్తుందన్న ప్రజలకు నిజాలు నిర్భయంగా వివరించి చెబుతున్నారు. నిజాలు తెలియడంతో స్థానిక ప్రభుత్వం చర్యలను ప్రజలు ఛీ కొడుతున్నారు.
నిజానికి దేశంలోని ఏ రాష్ర్టంలోనైనా కేంద్ర ప్రభుత్వ పథకాల సంక్షేమ ఫలాలు ప్రజలందరికీ సమానంగా అందిస్తోంది. కానీ బీజేపీ అధికారంలో లేని కొన్ని ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలు ఈ పథకాలన్నీ తమవిగా గొప్పలకు పోతున్నారు. ఇదే విషయాన్ని అన్నామలై విడమరిచి చెబుతుండడంతో ప్రతిపక్షాల పాచికలు పారడం లేదు.
మరోవైపు ఎన్నికల సందర్భంగా మంత్రులు, నాయకులు చేస్తున్న తప్పుడు వ్యాఖ్యలపై కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ లో ప్రసంగాలు చేస్తున్నారు. బహిరంగంగా హల్ చేస్తున్నప్రతిపక్షాల ఆడియోలు, వీడియోలపై కూడా అన్నామలై అలర్ట్ గా ఉండి పార్టీ వర్గాలను, కార్యకర్తలను కూడా ఉత్తేజితులను చేయగలుగుతున్నారు. మొత్తానికి తమిళనాడులో బీజేపీని పూర్తి మెజార్టీతో గెలిపించేందుకు అన్నామలై అందరిలో ఒక్కడినై.. ఒక్కడిలో అందరినై తన సత్తా చాటుతుండడం విశేషం. తమిళనాడులోని 39 లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి విడతలో పోలింగ్ జరగనుండగా, బుధవారం సాయంత్రం ఐదు గంటలతో ప్రచార పర్వం మూగబోనుంది.