అబూజ్ మడ్ లో ఎన్ కౌంటర్ ఏడుగురు మావోలు మృతి
భారీగా ఆయుధాలు స్వాధీనం
రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర సరిహద్దులో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో ఏడుగురు నక్సలైట్లు మృతిచెందారు. వారిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు పేలుడు పదార్థాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. వివరాల్లోకి వెళితే..
ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్ అబూజ్ మడ్ తకమెటా ప్రాంతంలో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్ సిబ్బందికి అందిన సమాచారం మేరకు నారాయణ్ పూర్–కాంకేర్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. వేకువజామున ఆ ప్రాంతానికి చేరుకున్న భద్రతా సిబ్బందిపై నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఎదురు కాల్పులు జరిపారు. కాగా ఈ ఎన్ కౌంటర్ పై భద్రతా దళాలు, పోలీసులు ఇంకా సమాచారం వెల్లడించలేదు. కాగా మృతిచెందిన నక్సలైట్లు ఎవరనే గుర్తింపు ప్రక్రియను చేపట్టినట్లు సమాచారం. మృతిచెందిన వారి వద్ద అత్యాధునిక ఏకె–47 ఆయుధాలు లభించాయి. ఏప్రిల్ 16న జరిగిన ఎన్ కౌంటర్ లో 26 మంది నక్సలైట్లు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఇదే పెద్ద ఎన్ కౌంటర్ కావడం విశేషం.