మూఢాచారాలు వదిలితేనే భారతీయత

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

Mar 24, 2024 - 16:14
 0
మూఢాచారాలు వదిలితేనే భారతీయత

డిస్పూర్: బెంగాలీ మాట్లాడే ముస్లింలు, బంగ్లాదేశ్​ నుంచి వచ్చిన ముస్లింలు బాల్య వివాహాలు, బహుభార్యత్వం లాంటి చెడు పద్దతులను విడనాడాలని అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వశర్మ హెచ్చరించారు.  అప్పుడే వారిని స్థానికులుగా పరిగణిస్తారని, ఆయా పద్ధతులను అవలంభించకుంటే అసోం స్థానికులుగా పరిగణించలేమన్నారు. ఆదివారం సీఎం శర్మ విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. అసోంలో సాంఘిక దురాచారాలకు బెంగాలీ మాట్లాడే ముస్లిం సమాజానికి చెందిన ప్రజలే కారణమని ఆరోపించారు. ఈ కమ్యునిటీలో ఎక్కువ మంది బంగ్లాదేశ్ నుంచి వచ్చినవారేనని ఆయన చెప్పారు.  బెంగాలీ మాట్లాడే ముస్లింలను మియా అంటారు. మియా ఇక్కడ అసలు నివాసినా కాదా అనేది వేరే విషయమన్నారు. బెంగాలీ మాట్లాడే ముస్లింలు స్థానికులుగా మారాలని కోరుకుంటే, దానిలో ఎటువంటి సమస్య లేదన్నారు. కానీ వారు చెడు పద్ధతులను విడిచిపెట్టి, మహిళలను విద్య కోసం ప్రేరేపించవలసి ఉంటుందని స్పష్టం చేశారు. అప్పుడే వారిని స్థానికులుగా గుర్తిస్తామన్నారు. ఇలా వలస వచ్చిన వారు బాల్య వివాహాలు, బహుభార్యాత్వం లాంటి పద్ధతులు పూర్తిగా వదులుకోవాలని సీఎం శర్మ హితవు పలికారు. ఇద్దరు లేదా ముగ్గురు భార్యలు ఉండడం అసోం, భారత సంస్కృతి కాదన్నారు. బాల్యవివాహాలు, బహుభార్యత్వానికి సంబంధించిన కేసుల్లో 2023లో ప్రారంభించిన విచారణలో మొదటిదశలో 3,483మందిని, రెండో దశలో 4,515 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. అక్టోబర్​లో 915మందిని అరెస్టు చేసి వారిపై కూడా కేసులు నమోదు చేశామని సీఎం హిమంత బిశ్వ శర్మ స్పష్టం చేశారు.