సీఎం రేవంత్ కు ఢిల్లీ పోలీసుల నోటీసులు
Delhi Police issued notices to CM Revanth Reddy in Amit Shah's morphing video case
నా తెలంగాణ, ఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరిట వైరలవుతున్న నకిలీ వీడియోలపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు.. రంగంలోకి దిగారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసినట్లు తెలుస్తున్నది. మే 1వ తేదీన విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
తెలంగాణలో పర్యటించిన షా
అమిత్ షా ఈ నెల 23న తెలంగాణలో జరిగిన విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తాం’’ అని వ్యాఖ్యానించారు. దీన్ని కొంతమంది వక్రీకరించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్‌ను రద్దు చేస్తామని షా చెబుతున్నట్లుగా ఎడిట్ చేశారని బీజేపీ ఆరోపిస్తోంది. దీన్ని తీవ్రంగా ఖండించిన పార్టీ అధికార ప్రతినిధి అమిత్ మాలవీయ చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని ఇటీవల హెచ్చరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణించింది. ఇది సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఉన్న పలు సోషల్ మీడియా ఖాతాలు షేర్ చేసినట్లు బీజేపీ ఆరోపిస్తోంది.
జీవన్ రెడ్డిపై ఫిర్యాదు..
కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి జీవన్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఆదివారం ఫిర్యాదు చేసింది. అమిత్ షా మార్ఫింగ్ వీడియోను జీవన్ రెడ్డి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారని పేర్కొన్నది. షా మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేశారని, దాన్ని వైరల్ చేస్తున్న జీవన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరింది.