దక్షిణాది యోగి దొరికాడా?
వామపక్ష భావజాలం నుంచి సనాతన భావజాలం దిశగా అడుగులు
పలుమార్లు ప్రధాని మోదీ ప్రశంసలు
హిందూత్వ వాయిస్ పెంచే దిశగా పవన్ అడుగులు
దాడులను అడ్డుకునేందుకు ‘కళ్యాణ్ నరసింహ వారాహి బ్రిగేడ్’ ఏర్పాటు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: దక్షిణాదిన హిందూ గళాన్ని బలపరిచేందుకు, సనాతన ధర్మాన్ని రక్షించేందుకు మరో యోగి ఆవిర్భవించాడా? పలు వేదికలపై తన మాటలతో వేడి పుట్టించే పవన్ కళ్యాణ్ మరో యోగిలా అవతరించనున్నాడా? అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన పొత్తుతో విజయం సాధించాక క్రమేణా పవన్ కళ్యాణ్ రాజకీయ చతురతలో మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు ‘చేగువేరా’ లాంటి విప్లవయోధుడిని ఆరాధిస్తూ ముందుకు వెళ్లే పవన్ కళ్యాణ్ ఆలోచనారీతిలో క్రమేణా మార్పులు చోటు చేసుకున్నాయి. తిరుపతి లడ్డూ, హిందూ దేవాలయాలపై దాడులు, మహిళలపై దాడులు వంటి విషయాల్లో బహిరంగవేదికలపై పవన్ కళ్యాణ్ తన కూటమి పార్టీ అని కూడా చూడకుండా విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంలో ముందువరుసలో ఉన్నారు. అందుకే ఆయన్ను ప్రధాని మోదీ ‘పవన్’ అంటే ఆంధీ ‘తుపాను’ అని ఓ సభలో ప్రశంసించారు. పవన్ చురుకుదనం, వేగవంతమైన మాటతీరు, నిర్ణయాల పట్ల సంతుష్ఠత వ్యక్తం చేశారు. పలుమార్లు బడానాయకులకు కాదని ఆయన్ను ఆలింగం చేసుకున్నారు.
దక్షిణాదిన బలమైన హిందూత్వ వాదాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వేదికలు, సంఘాలు అనేకం ఉన్నా ఎక్కడో ఓ లోటులా కనిపించేది కేంద్ర పెద్దలకూ. కానీ పవన్ కళ్యాణ్ క్రమేణా తన సత్తాను చాటుతూ నాలుగు రోజుల క్రితం ‘కళ్యాణ్ నరసింహ వారాహి బ్రిగేడ్’ ఏర్పాటును ప్రకటించారు. ఈ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో సనాతన ధర్మ పరిరక్షణకు అంకితం చేశారు. ఇతర మతాలు, కులాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని కాపాడుకుంటామని ప్రకటించారు.
దేవాలయాలపై ఖలిస్థానీల వరుస దాడులు, దేశంలో హిందూ దేవాలయాలపై దాడులు, పర్వదినాల్లో నిర్వహిస్తున్న భక్తి ర్యాలీలపై రాళ్ల దాడులు బహిరంగంగానే ఖండించారు. ఒక్కో అడుగు బలంగా వేస్తూ దక్షిణాదిన పవన్ (తుపాను) యోగి బుల్డోజర్ విధానంలో పయనించేలా ఉందని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈయన స్థాపించిన సనాతన ధర్మ పరిరక్షణ సంస్థతో ఒక్కసారిగా దక్షిణాది దేశంలో హిందూత్వ వాదులకు మరింత బలం చేకూరినట్లయ్యింది.
పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన పార్టీ 2014 ఎన్నికలకుముందు పార్టీని వామపక్ష భావజాలంతో ప్రారంభించారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో 21 అసెంబ్లీ స్థానాలు, రెండు లోక్ సభ స్థానాలను గెలుచుకొని సత్తా చాటింది. మిగతా నియోజకవర్గాలలో కూడా భారీగా ఓటింగ్ శాతాన్ని పెంచుకోగలిగింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ భావజాలంలో పూర్తి మార్పు చోటు చేసుకుంది. 2009 ఎన్నికలలో కూడా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ 18 శాతం ఓట్లతో 18 సీట్లను గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ లో 26 శాతంగా ఉన్న కాపు సామాజిక వర్గానికి చెందిన వారు పవన్ కళ్యాణ్. ఓ దశలో ప్రజారాజ్యం విజయం ఖాయమనై హైప్ వచ్చినా అప్పట్లో అది సాధ్యపడలేదు. ప్రస్తుతం జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గంతోపాటు ఇతర వర్గాల మద్ధతు కూడా బలంగా లభిస్తుంది. క్రమేణా పవన్ కళ్యాణ్ భావజాలంలో మార్పుతో దక్షిణాదికి మరో యోగి ఆదిత్యనాథ్ దొరికినట్లేనని భావిస్తున్నారు.
ఏది ఏమైనా ప్రధాని ప్రశంసలు, పవన్ కళ్యాణ్ ఆలోచనా రీతిలో మార్పు, సమస్యలు, వివాదాలపై స్పందించే తీరు, ముఖ్యంగా మాటతీరులో ఫైర్ అనేవి ఆయన్ను దక్షిణాది రాష్ర్టాల్లో సనాతన ధర్మాన్ని కాపాడే ముఖ్య నాయకుడిగా రూపొందిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.