హయాతీలో నరమేధం.. 70మంది మృతి
Genocide in Hayati.. 70 people died
మృతుల్లో 10మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు
రాజధానిపై పట్టుకోసమే గ్యాంగ్ వార్ లు
దాడి చేసింది గ్రాన్ గ్రీఫ్ గ్యాంగ్ గా గుర్తింపు
పోర్ట్ ఓ ప్రిన్స్: కరేబియన్ దీవి హయాతీలో గ్యాంగ్ వార్ లో 70మంది మృతి చెందారు. మృతుల్లో 10మంది మహిళలు ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని ఐక్యరాజ్యసమితి శనివారం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ దేశంలో నానాటికి జీవన పరిస్థితులు మృగ్యం కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేసింది. రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ పై ఆధిపత్యం కోసం పలు గ్యాంగ్ లు ఇలా గ్యాంగ్ వార్ లకు పాల్పడుతుంటాయి.
ఇందులో భాగంగానే గురువారం వేకువజామున ఒక్కసారిగా రాజధానికి 60 కిలోమీటర్ల దూరంలోని సొండే పట్టణంలో మరో గ్యాంగ్ వారిపై భారీ దాడికి పాల్పడ్డాయని యూఎన్ స్పష్టం చేసింది. ఆకస్మికంగా దాడి చేయడంలో అక్కడ నివసిస్తున్న మూడువేల మంది ప్రాణభయంతో పరుగులు తీశారు. దాడులకు పాల్పడింది గ్రాన్ గ్రీఫ్ గ్యాంగ్ గా గుర్తించారు.
హయాతీలో 150కి పైగా ఇలాంటి గ్యాంగ్ లు ఉన్నాయి. అన్ని గ్యాంగ్ లు రాజధానిపై ఆధిపత్యం కోసం పోరాడుతూ.. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం పరిపాటిగా మారింది. ఈ దాడుల్లో అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇటీవలే ఇక్కడి జైళ్లపై ఈ ముఠాలు దాడికి పాల్పడి అందులో ఉన్న నాలుగువేల మంది గ్యాంగ్ సభ్యులను విడిపించుకుపోయాయి.
ఈ దేశంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ దేశాలకు పిలుపునిచ్చినా ఏ దేశం అక్కడికి తమ సైన్యాన్ని పంపేందుకు ఇష్టపడలేదు.