ఎస్సీ ఎస్టీ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి

అనవసర కేసులు బనాయిస్తే చర్యలు నాణ్యమైన భోజనం, మెరుగైన విద్యపై చర్యలు కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య 

Aug 30, 2024 - 17:28
 0
ఎస్సీ ఎస్టీ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి
నా తెలంగాణ, సంగారెడ్డి: ఎస్సీ, ఎస్టీ కేసులు త్వరితగతిన  పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య  అన్నారు. సంగారెడ్డి కలెక్టరేట్​ లో జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి, జిల్లా ఎస్పీ రూపేష్ ఆధ్వర్యంలో వివిధ శాఖలు ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులతో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  పెండింగ్​ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను అనవసరంగా కేసుల్లో ఇరికించే పద్ధతులను పోలీసు సిబ్బంది విడనాడాలని ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేలా రెవెన్యూ పోలీసు సిబ్బంది పని చేయాలని అన్నారు.
 
మండలాల ప్రత్యేక అధికారులు జిల్లా స్థాయి అధికారులు ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలలను వసతి గృహాలను తరచు తనిఖీలు చేయాలని విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెరుగైన విద్యను అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీలకు వేధింపులకు గురి చేసే అధికారులపై కఠిన చర్యలు కమిషన్ తరపున తీసుకున్నట్టు తెలిపారు. 
 
ఎక్కడైనా ఎస్సీ, ఎస్టీలకు సమస్యలు ఎదురైతే అక్కడికి కమిషన్ వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అన్ని రకాల కేసులను సెప్టెంబర్ ఆఖరులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ప్రతినెల రోజులకు ఒకసారి ఎస్సీ, ఎస్టీ సమస్యలపై అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్, ఎస్పీలకు సూచించారు. 
 
అనంతరం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ విద్యార్థులకు మంచి విద్య మంచి భోజనం   అందించేందుకు హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ విధిగా అధికారులు విధిగా తనిఖీ చేస్తామని, పాఠశాలలో  సదుపాయాలు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వివరించారు.  
 
భూ సమస్యలపై ఆర్డీవోలతో ఎంక్వయిరీ చేయించి  ఎస్సీ, ఎస్టీలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి గ్రామంలో సివిల్ సర్వీస్ డే కార్యక్రమాలు జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని  తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు వసతిగృహాల సమస్యల కోసం పరిష్కారం కోసం చేపట్టిన కార్యక్రమాలను జిల్లా కలెక్టర్,ఎస్సీ, ఎస్టి కమిషన్ చైర్మన్ కు సభ్యులకు కలెక్టర్ వివరించారు. 
 
ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, లక్ష్మీనారాయణ, రేణిగుంట ప్రవీణ్, నీలాదేవి, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి అఖిలేష్ రెడ్డి, డివిఎంఎస్ సభ్యులు, అధికారులు, కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.