నా తెలంగాణ, సంగారెడ్డి: రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం ఆర్.ఓ.ఆర్ 2024 చట్టాన్ని తీసుకువస్తున్నదని అసిస్టెంట్ కలెక్టర్ మనోజ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచనల ప్రకారం ధరణి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన నూతన రెవెన్యూ చట్టం-2024 ముసాయిదాపై వివిధ వర్గాల వారి అభిప్రాయాలను సేకరించేందుకు శనివారం సంగారెడ్డి కలెక్టరేట్ లో సమావేశ మందిరంలో ఆర్ ఓ ఆర్ 2024 చట్టంపై చర్చా వేదిక నిర్వహించారు.
ఈ సందర్బంగా అసిస్టెంట్ కలెక్టర్ మనోజ్ మాట్లాడుతూ చర్చా వేదిక ద్వారా వెల్లడైన అందరి అభిప్రాయాలను క్రోఢీకరించి ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నూతన ఆర్.ఓ.ఆర్ ముసాయిదా బిల్లు-2024పై ప్రజల నుంచి సీసీఎల్ఏ వెబ్ సైట్ ద్వారా సూచనలు, సలహాలు స్వీకరించామన్నారు.
జిల్లా స్థాయిలోనూ మేధావులు, రెవెన్యూ చట్టం పట్ల అవగాహన కలిగి ఉన్న వారి అభిప్రాయాలను తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.
రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు సైతం తమ దైనందిన విధుల నిర్వహణ సందర్భంగా గమనించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని సూచించారు. అనంతరం నూతన ముసాయిదా చట్టంలోని అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా డిఆర్ఓ పద్మజారాణి వివరించారు.
రైతు సంఘ నాయకులు..
భూ సంబంధిత అంశాలతో కూడిన సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రత్యేక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసి, రెవిన్యూ అధికారులకు అప్పిలేట్ అథారిటీ అధికారం కల్పించాలని కోరారు. చిన్న, సన్నకారు రైతులకు లబ్ది చేకూరేలా, సత్వరమే వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా నూతన చట్టం దోహదపడాలని, ఆ దిశగా అధికారులందరూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని తమ అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రభుత్వం రూపొందించిన నూతన ముసాయిదా చట్టాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే, క్షేత్రస్థాయిలో చట్టాల అమలు పకడ్బందీగా జరగాల్సిన అవసరం ఉందని రైతులు, రైతు సంఘాల నాయకులు, రెవెన్యూ నిపుణులు, రిటైర్డ్ ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ఈ చర్చా వేదికలో ఆర్డిఓ, తహశీల్దర్ లు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.