గార్డులను విడిపించిన రష్యన్ దళాలు
పలువురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హతం
మాస్కో: రష్యాలోని రోస్టోవ్ నగరం జైలులో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు బందీలుగా చేసుకున్న గార్డులను ప్రత్యేక దళాలు విడిపించాయి. ఆదివారం బందీలుగా చేసుకున్న వీరిని సోమవారం ఉదయం రష్యన్ దళాల ప్రత్యేక ఆపరేషన్ తో ముగించారు. ఈ ఆపరేషన్ లో పలువురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు హతమైనట్లు రష్యా అధికారులు వివరించారు. ఆదివారం ఆరుగురు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు జైలు కిటికినీ బద్ధలు కొట్టి గార్డుల గదిలోకి ప్రవేశించి ఇద్దరు గార్డులను అదుపులోకి తీసుకొని తమను సురక్షితంగా విడిచిపెట్టాలని, రవాణా సదుపాయం, ఆర్థిక సహాయాన్ని చేయాలని డిమాండ్ చేశారు. తాము సురక్షితంగా బయటికి వెళ్లాక గార్డులను వదిలిపెడతామని షరతులు విధించారు. దీంతో ఆదివారం నుంచి వారిని విడిపించేందుకు రష్యన్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సోమవారం ఉదయం వరకూ ఆపరేషన్ ను విజయవంతంగా పూర్తి చేసి గార్డులను విడిపించాయి.కాగా ఈ ఆపరేషన్ లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారనేది తెలియరాలేదు.