అమెరికాలో బర్డ్ ఫ్లూ విజృంభణ
కరోనా కంటే డేంజర్ అంటున్న ప్రముఖ వైద్యులు
వాషింగ్టన్: అమెరికాలో బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తోంది. సోమవారం వరకు 48 రాష్ట్రాల్లో 9 కోట్లకు పైగా కోళ్లకు వ్యాపించింది. భారత్ లోనూ ఈ కేసులు వెలుగు చూస్తున్నాయి. బర్డ్ ఫ్లూ పై అమెరికా వైద్యాధికారి రాబర్ట్ రెడ్ ఫీల్డ్ మాట్లాడుతూ ఈ వ్యాధి కరోనాలా విజృంభించే అవకాశం ఉందని చెప్పారు. కరోనా మరణాల కంటే బర్డ్ ఫ్లూ మరణాల శాతం ఎక్కువన్నారు. ఈ వ్యాధి హెచ్–5 ఎన్ –1 అనే వైరస్ ద్వారా సంక్రమిస్తుంది. సోకిన ప్రతీ పదిమందిలో ఆరుగురు చనిపోయినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయని రాబర్ట్ తెలిపారు. ఈ వ్యాధి పక్షుల ద్వారా జంతువులకు వ్యాపిస్తుందని తద్వారా మనుషులకు కూడా వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. అయితే ఈ వ్యాధికారక బ్యాక్టీరియాలో నాలుగు రకాలున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇన్ఫ్ల్యూ యేంజా ఏ, బీ,సీ,డీ నాలుగురకాలున్నాయని చెప్పారు. ఈ తరహా నాలుగు రకాలు ఎక్కువగా మనుషులకు సోకే అవకాశం లేదన్నారు. హెచ్–5 ఎన్ –1, హెచ్–7 ఎన్ –9 రకాల వైరస్ మాత్రమే మనుషులకు సోకే ప్రమాదం ఉందన్నారు. దీనికి తోడు ప్రస్తుతం విజృంభిస్తున్న వైరస్ హెచ్–9 ఎన్–2గా గుర్తించాని ఇది మానవాళికి కొత్త ముప్పును తీసుకువచ్చే ప్రమాదం లేకపోలేదని రాబర్ట్ రెడ్ ఫీల్డ్ ఆందోళన వ్యక్తం చేశారు. కాగా ఇటీవలే బర్డ్ ఫ్లూ కు సంబంధించిన రెండు కేసులు కూడా భారత్ లో నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.