యూఎన్ఎస్సీలో సభ్యుల సంఖ్య పెంచాలి
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఏ దేశాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే అంశంపై భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ యూఎన్ఎస్సీ (యునైటెడ్ నేషన్ సెక్యురిటీ కౌన్సిల్)లో శుక్రవారం ప్రతిపాదనను సమర్పించారు.
నా తెలంగాణ, ఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఏ దేశాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలనే అంశంపై భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ యూఎన్ఎస్సీ (యునైటెడ్ నేషన్ సెక్యురిటీ కౌన్సిల్)లో శుక్రవారం ప్రతిపాదనను సమర్పించారు. భద్రతా మండలిలో సభ్యుల సంఖ్యను 26కు పెంచాలని కోరారు. జీ–4 దేశాలైన బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్ తరఫున రుచిరా ఈ ప్రతిపాదనను సమర్పించారు. భారతదేశం తరపున ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ 'భద్రతా మండలి సంస్కరణలపై ప్రభుత్వాల మధ్య చర్చలు' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు.
భారత్ చేసిన సూచనలు..
ఆరుగురు శాశ్వత సభ్యులు, నలుగురు లేదా ఐదుగురు తాత్కాలిక సభ్యులను భద్రతా మండలిలో చేర్చుకోవాలని సూచించారు. ఆరు కొత్త శాశ్వత సభ్యులలో రెండింటిని ఆఫ్రికన్ దేశాలు, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్ ఒకటి, పశ్చిమ యూరోపియన్, ఇతర దేశాలు ఒకటి ప్రతిపాదించాలని భారతదేశం సూచించింది.
ప్రస్తుత వ్యవస్థలో సంస్కరణలు అవసరం..
రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. ప్రస్తుత భద్రతా మండలి వ్యవస్థలో శాశ్వత, తాత్కాలిక విభాగాల్లో ప్రాతినిథ్యం కరువైంది. దీని కారణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అంత ప్రభావవంతంగా లేదు. ప్రపంచ స్థిరత్వం, శాంతి కోసం తక్షణ సంస్కరణ అవసరం. ప్రాతినిథ్యం లేమిని విస్మరించడం ద్వారా ఎటువంటి సంస్కరణ సాధ్యం కాదని, ముఖ్యంగా శాశ్వత వర్గంలో భారీ అసమతుల్యత ఉందని, దీని కారణంగా భద్రతా మండలి అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడంలో అసమర్థంగా నిరూపిస్తోందని కాంబోజ్ అన్నారు. సంస్కరణల కోసం చేసిన సిఫార్సులు ఏదైనా నిర్దిష్ట దేశాన్ని సభ్యదేశంగా చేయడానికి చేయలేదని, అయితే ప్రజాస్వామ్యబద్ధంగా, అందరినీ కలుపుకొని ఎన్నికల ద్వారా నిర్ణయం తీసుకుంటామని కాంబోజ్ చెప్పారు.
భారత్ సమర్పించిన ప్రతిపాదనలో వీటోకు సంబంధించిన సూచనలు కూడా ఇచ్చారు. కొత్త శాశ్వత సభ్యులకు కూడా ప్రస్తుత సభ్యులకు సమానమైన బాధ్యతలు, హక్కులు ఉంటాయని, అయితే వారు క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత మాత్రమే ఏదైనా అంశంపై వీటో నిర్ణయం తీసుకోగలరని పేర్కొన్నారు. ప్రస్తుతం, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో చైనా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికా ఐదు దేశాలు మాత్రమే వీటో అధికారం కలిగి ఉన్నాయి. మిగిలిన ఇద్దరు సభ్యులు తాత్కాలికం, రెండేళ్లపాటు ఎన్నికైనవారికి వీటో అధికారం లేదు. భద్రతా మండలిలో భారత్ చేరికను ఫ్రాన్స్, అమెరికాలు కూడా సమర్థించాయి.
ఇదే అంశంపై గతంలో యూఎన్ఎస్సీలో భారత కౌన్సిలర్ ప్రతీక్ మాథూర్ కూడా గళమెత్తారు.