నదులు ఎండిపోతున్నాయి
భూగర్బ మట్టాల్లో తగ్గుదల.. తాగు, సాగు నీటికి కష్టాలు.. 13 నదుల్లో నీటి లభ్యత శూన్యం.. 150 రిజర్వాయర్లలో నిల్వ సామర్థ్యం కంటే 36 శాతం తక్కువ.. సెంట్రల్ వాటర్ కమిటీ నివేదికలో కీలకాంశాలు వెల్లడి.. పశ్చిమ బెంగాల్లో ఉపాధి కోల్పోయి భోరుమంటున్న మత్స్యకారులు
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: వేసవి ఆరంభంలోనే దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా విజృంభిస్తున్నాయి. దీనికి తోడు భూగర్భ జలమట్టాల్లో భారీ తగ్గుదల నమోదవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతున్నది. దేశంలోని కోట్ల మంది దాహార్తి, సాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన నదుల్లో భారీస్థాయిలో నీటిమట్టాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే 13 నదుల్లో అసలు నీటి ప్రవాహమే లేక ఎండిపోయాయి. గంగ, బ్రహ్మపుత్ర, సింధు, పెన్నార్, నర్మద, తాపీ, సబర్మతి, గోదావరి, మహానది, కావేరీ నదుల్లో నీరు వేగంగా తగ్గిపోతోంది. గతేడాదితో పోలిస్తే ఈ నదుల్లో భారీస్థాయిలో నీటిమట్టం తగ్గింది. ఆయా నదుల ద్వారా 11 రాష్ట్రాల్లోని 2.86 లక్షల గ్రామాలకు సాగు, తాగునీటి అవసరాలు తీరుతున్నాయి. ఈసారి వర్షాకాలంలో వానలు సమృద్ధిగా కురిసినప్పటికీ ఎండల తీవ్రత పెరిగిపోవడమే నీటి కొరతకు కారణంగా సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) చెబుతోంది. భారతదేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో మొత్తం నీటి నిల్వ సామర్థ్యం కంటే 36 శాతం తక్కువగా ఉన్నట్లు పేర్కొంది. 86 రిజర్వాయర్లలో 40శాతం, అంతకంటే తక్కువ నీరు ఉందని వివరించింది. మార్చి 28న సీడబ్ల్యూసీ దేశవ్యాప్త ప్రధాన రిజర్వాయలలోని నీటి నిల్వ సామర్థ్యాలపై నివేదిక విడుదల చేసింది. ఇందులో దక్షిణాది రాష్ట్రాలు, మహారాష్ట్ర, గుజరాత్‌లలో అత్యధిక రిజర్వాయర్లు ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్లో గంగానది ఎండిపోవడంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయి భోరుమంటున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు ప్రస్తుతం నదులలో ఉన్న నీరు కూడా తాగేందుకు యోగ్యంగా లేదని సీడబ్ల్యూసీ నివేదికలో వెల్లడించింది. కాలుష్యకారకాలు ఎక్కువగా ఉన్నందున తాగునీటికి వినియోగించే ముందు శుద్ధి చేయడం తప్పనిసరి అని పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల్లో వర్షాపాతం అత్యధికంగానే ఉన్నప్పటికీ 2023కు సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొరత ఏర్పడింది. ఆంధ్రలో 65 శాతం, తెలంగాణలో 67 శాతం మాత్రమే వర్షాలు పడినట్లు సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల్లో ని 20 నదీ పరివాహాక ప్రాంతాల్లో 12 ప్రాంతాల్లో గతేడాది కంటే తక్కువగా నీటి లభ్యత ఉంది. కావేరి, పెన్నార్, కన్యాకుమారి, తూర్పున ప్రవహించే నదులలో నీటి లభ్యత అత్యంత తక్కువగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది. సబర్మతి నదిలో కరవు పరిస్థితులుండగా, గంగానదిలో సగం కంటే నీరు తక్కువగా ఉంది. రోజురోజుకు నీటిమట్టం భారీగా తగ్గుతోంది. అదే నర్మదాలో 46 శాతం నీటి లభ్యత తగ్గింది. గంగా పరీవాహక ప్రాంత బేసిన్‌లో 65.57 శాతం విస్తీర్ణం వ్యవసాయ భూమి ఉండగా, నర్మదాలో 46.2 శాతం, తపతి నదిలో 56 శాతం, గోదావరిలో 34.76 శాతం, మహానదిలో 49.53 శాతం, సబర్మతిలో 39.54 శాతం నీటి కొరత ఉంది.
మహానది, పెన్నార్ మధ్య తూర్పు దిశగా ప్రవహించే 13 నదుల్లో నీరు పూర్తిగా అడుగంటి పోయింది. నీటి లభ్యత లేదు. రుషికుల్య, వరాహ, బహుద, వంశధార, నాగావళి, శారద, తాండవ, ఏలూరు, గుండ్లకమ్మ, తమ్మిలేరు, మూసి, పాలేరు, మున్నేరు నదుల్లో నీటి లభ్యత పూర్తిగా తగ్గిపోయింది. దాదాపు లేదనే చెప్పొచ్చు. ఈ నదులు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా మీదుగా ప్రవహిస్తున్నాయి. వేసవికి ముందే పరిస్థితులు రోజురోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఈ నదుల ద్వారా 86,643 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో పంటలకు సాగునీరు అందుతోంది. ఈ నదులన్నీ బంగాళాఖాతంలో కలిసేవే. ఈ బేసిన్‌లో 60 శాతం వ్యవసాయ ప్రాంతం ఉంది. ఐఐటీ గాంధీనగర్ యూనివర్సిటీ నిర్వహిస్తున్న సర్వేలు భారత్‌లో కరవు మానిటర్‌ను సూచిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం దేశంలోని 35.2శాతం ప్రాంతాలు అసాధారణమైన కరవు కేటగిరీలో ఉన్నాయి. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ ప్రాంతంలో 7.8 శాతం తీవ్రమైన కరవులో ఉంది. 3.8 శాతం అసాధారణ కరవులో ఉన్నట్లుగా యూనివర్సిటీ సర్వేలో తేలింది. ఏడాది క్రితం ఇది వరుసగా 6.5 శాతం, 3.4 శాతంగా నమోదయ్యాయి. కర్నాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు వర్షాభావ పరిస్థితుల కారణంగా కరవు పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. ఇందులో భాగంగా ఇప్పటికే బెంగళూరులో నీటిఎద్దడిని చూస్తున్నాం.