నా తెలంగాణ, సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకరా? రాష్ట్రానికి ముఖ్యమంత్రివా? అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అనుచిత వ్యాఖ్యలు చేశారు. జహీరాబాద్ పరిధిలోని న్యాల్కల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీకి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని రైతులకు మద్ధతు తెలిపారు. రేవంత్ పాలన పిచ్చొడి చేతిలో రాయిలా తయారైందన్నారు. అది జహీరాబాద్ రైతుల నెత్తిన పడిందన్నారు. ఫార్మాసిటీని తక్కువ స్థలంలో ఏర్పాటు చేసి మిగతా స్థలంలో రియల్ వ్యాపారం చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. పచ్చని పంటలు పండుతున్న భూముల్లో ఫార్మా సిటీ నిర్మాణం ఏమిటని నిలదీశారు.
మూసీ సుందరీకరణ పేరుతో నిరుపేదల ఇళ్లు కూల్చుతారా? అని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గరీబ్, కిసాన్ కో హఠావో అన్నట్లుగా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. ఇందిరమ్మ ఇళ్లు, భూములకు పట్టాలు ఇవ్వడం దెవుడెరుగు అన్నారు. ఉన్నవి కాస్త ప్రజల నుంచి లాక్కుంటున్నారని ఆరోపించారు. రుణమాఫీ ఇంతవరకూ కాలేదని విమర్శించారు. బతుకమ్మ చీరలు కూడా రాలేవని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి పాలనను చూస్తూ ఊరుకోబోమని ఎండగడతామని హరీష్ రావు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్యరావు, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్, అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి, పీసీసీబీ ఉమ్మడి మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు పట్నమాణిక్యం, బీఆర్ఎస్ నాయకులు నరహరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.