నీట మునిగిన కాలనీలోని ఇండ్లు
వర్షాలతో బయటపడ్డ చెరువు ఆక్రమణ
రియల్ వ్యాపారులు, అధికారుల నిర్వాకంతో నిరుపేదలకు అన్యాయం
ప్రభుత్వం న్యాయం చేయకుంటే మరణమే శరణ్యం అంటున్న బాధితులు
నా తెలంగాణ, సంగారెడ్డి: కొందరి స్వార్థ ప్రయోజనాలు కోసం పేదలు మధ్యతరగతి ప్రజలను మోసం చేసి చెరువు కుంటలను ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయించారు. సొంతింటి కలను నిజం చేసుకోవాలని ఆశతో లక్షలు వెచ్చించి ప్లాట్లను కొనుగోలు చేసిన సామాన్య జనం మోసపోయారు.
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలోని రాజంపేట డ్రైవర్స్ కాలనీ సమీపంలో ఎర్రకుంట చెరువు సర్వే నంబర్ 376లో 11.32 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ లలో నిర్మాణాలు చేపట్టరాదనే నిబంధనలు ఉన్నప్పటికీ రియల్ వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కి తమ పలుకుబడిని ఉపయోగించి చెరువులో కొంత భాగాన్ని ఆక్రమించి ప్లాట్లుగా చేసి అమాయకులకు విక్రయించారు.
వర్షాలతో బయటపడ్డ చెరువు కబ్జా..
సంగారెడ్డిలో గత వారం పది రోజులుగా ఏకధాటిగా కురిసిన భారీ వర్షాల వల్ల చెరువును ఆక్రమించిన విషయం బయట పడింది. సంగారెడ్డి లోని రాజంపేట డ్రైవర్స్ కాలనీ సమీపంలో ఎర్రకుంట చెరువులో వర్షపు నీరు చేరడంతో ఇళ్లలోకి భారీగా వర్షపు నీరు రావడంతో బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చెరువునే ప్లాట్లుగా మార్చి తమకు విక్రయించారనే విషయాన్ని అక్కడే ఇల్లు కట్టుకొని ఆశ్రయం పొందుతున్న వారు తెలుసుకొని లబోదిబోమంటున్నారు. రియల్, బ్రోకర్లను నిలదీస్తామనే వారు ఇటువైపు తొంగి చూడడం లేదని వాపోతున్నారు.
తప్పేవరిదీ.. శిక్షేవరికీ..
చెరువును ఆక్రమించి ప్లాట్లుగా మార్చి విక్రయించిన రియల్ బ్రోకర్లు అధికారులను తమ కనుసైగల్లో పెట్టుకొని ఈ తంతంగం అంతా నడిపించారని ప్రస్తుతం ఇళ్లలో ఉంటున్న వారు ఆరోపిస్తున్నారు. చెరువులు, కుంటలు, నాళాలను పరీరక్షించాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల అధికారుల నిర్లక్ష్యం కారణంగా కబ్జా అయి సొమ్ము చేసుకున్నా అధికారులు గుర్తించకపోవడం గమనార్హం.
ఏది ఏమైనా ఎన్నో కష్టనష్టాలకోర్చి ఇక్కడ ఇళ్లు నిర్మించుకున్నామని, ఇప్పుడు వాటిని కూలగొడితే తాము వీధినపడడమే గాక తమ జీవిత సంపాదన మొత్తం నీళ్లపాలవుతుందని, పెళ్లాం, పిల్లలతో రోడ్డు పడతామని ప్రభుత్వమే ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకొని తమను ఆదుకునేలా సరైన దిశలో పరిష్కార మార్గం కనుగొనాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే తమకు ఇక మరణమే శరణ్యమని వాపోతున్నారు.
నీటివనరులను పరిరక్షించాలి: సిఐటీయు జిల్లా కార్యదర్శి సాయిలు..
సంగారెడ్డిలో చెరువులను ఆక్రమించిన వారిపై వారికి సహకరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని సిఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. చెరువులు, కుంటలు పరిరక్షించాల్సిన అధికార యంత్రాంగం మొద్దునిద్దు, ఉదాసీనతపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో నిరుపేదలు, ఇళ్లు కట్టుకున్నవారికి ప్రత్యామ్నాయం చూపాకే చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. అంతేగాక రియల్ బ్రోకర్లు, వ్యాపారులకు సహకరించిన అధికారుల నుంచే బాధితులకు పూర్తి నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.