నా తెలంగాణ, సంగారెడ్డి: మైనర్ బాలికను అత్యాచారం కేసులో దోషిగా నిర్ధరణ అయిన వ్యక్తికి చనిపోయే వరకూ ఉరితీయాలని సంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది. గురువారం ఈ కేసుపై విచారణ జరిపింది. కేసు వివరాలను జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
పటాన్ చెర్వులోని ఓ సంస్థలో పనిచేస్తున్న తల్లిదండ్రులు తమ కూతురును అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు వద్ద ఉంచి వెళ్లారు. ఆ సెక్యూరిటీ గార్డుకు పాప తమకు తెలిసిన బాలికేనని మాయమాటలు చెప్పిన అదే సంస్థలో పనిచేస్తున్న నిందితుడు గఫాఫర్ అలీ (56) బాలికను బయటికి తీసుకువెళ్లి ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలిక ఎవరికైనా చెబుతుందనే హత్య చేశాడు.
ఈ హత్యపై ఎస్సీ, ఎస్టీ కేసును ఇన్స్ పెక్టర్ రవీందర్ రెడ్డి నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి డీఎస్పీ పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో చార్జీషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయమూర్తి జయంతి నిందితునికి చనిపోయేంత వరకు ఉరితీయాలని తీర్పునిచ్చారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు రూ. 10 లక్షల నష్టపరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
ఈ కేసును ఎస్పీ చొరవ తీసుకొని 11 నెలల్లోనే దోషికి శిక్షపడేలా చర్యలు తీసుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసు విచారణ, చార్జీసీటు దాఖలు, నిందితున్ని అరెస్టు చేయడం ఇలా అన్ని విషయాల్లో సహకరించిన అదనపు ఎస్పీ సంజీవ రావు, అశోక్, అప్పటి యస్.హెచ్.ఒ రవీందర్ రెడ్డి, ఇన్స్పెక్టర్ బిడియల్ భానూర్, ఇన్వెస్టిగేషన్ అధికారులు పురుషోత్తం రెడ్డి, పి.పి.లు అనంత రావ్ కులకర్ణి, కృష్ణ, భరోసా లీగల్ సపోర్ట్ పర్సన్ సౌజన్య, కోర్ట్ డ్యూటీ ఆఫీసర్స్ వెంకటేశ్వర్లు, రఫీక్, సీత నాయక్, కోర్ట్ లైజనింగ్ అధికారి కె. సత్యనారాయణ, ఎస్ఐ. డీసీఆర్బీ, ఇన్స్పెక్టర్ బి. రమేష్ లను ఎస్పీ అభినందించారు.