పోలీసు అమరుల త్యాగాలకు గుర్తుగానే పోలీస్ ఫ్లాగ్ డే

సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ 

Oct 25, 2024 - 19:04
 0
పోలీసు అమరుల త్యాగాలకు గుర్తుగానే పోలీస్ ఫ్లాగ్ డే
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: పోలీసు అమరుల త్యాగాలకు గుర్తుగానే పోలీస్ ఫ్లాగ్ డే నిర్వహిస్తున్నామని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ అన్నారు. ఫ్లాగ్ డే వారోత్సవాలలో భాగంగా శుక్రవారం రాయల్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేది నుంచి 31వ సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి (ఏక్తా దివాస్) వరకు పోలీసు ఫ్లాగ్ డే వారోత్సవలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. సి.ఆర్.పి.యఫ్ ఎస్.ఐ కరమ్ సింగ్ నాయకత్వంలోని 20 మందితో లడక్ ప్రాంతంలో హాట్ స్ట్రింగ్ వద్ద విధులు నిర్వహిస్తున్న భారత జవాన్ల పై చైనా ఆర్మీ దొంగ దాడి చేసి 10 మందిని హతమార్చిందన్నారు. అప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో అసువులు బాసిన పోలీసు అమరవీరులను స్మరిస్తూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా (పోలీస్ ఫ్లాగ్ డే) గా నిర్వహిస్తున్నమన్నారు. ఫ్లాగ్ డే ను పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ క్యాప్ వంటి కార్యక్రమాలు, పోలీసు అమరుల కుటుంబ సభ్యులను కలిసి వారి యోగా క్షేమాలు తెలుసుకోవడం, స్కూల్స్, కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు పోలీసు శాఖ పని తీరు గురించి అవగాహన కార్యక్రమాలు, వ్యాసరచన పోటీలను నిర్వహిస్తామన్నారు. 
 
చెడుకు వ్యాసనాలకు ఆకర్షితులు కావద్దని, మన చుట్టూ జరుగుతున్న చట్టా వ్యతిరేక అసాంఘిక కార్యకలాపాలు, ర్యాగింగ్స్ వంటి చట్ట విరుద్ధమైన కార్యకలాపాలపై బాధ్యత గల భారత పౌరులుగా పోలీస్ శాఖకు సమాచారం అందించాలని, జిల్లా ఎస్పీ  ఫోన్ నెంబర్ 8712656777 కు నేరుగా సమాచారం అందించాలని సూచించారు. జిల్లా ప్రజల ధన మాన ప్రాణ రక్షణలో జిల్లా పోలీసు శాఖ అహర్నిశలు కృషి చేస్తుందని అన్నారు. జిల్లాలో మహిళల భద్రతకు పెద్ద పీట వేస్తూ ఎస్​ఎస్​ఎస్​ సీ ఆధ్వర్యంలో షీ షట్లర్ బస్సులను ప్రారంభించడం జరిగిందని, ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ బైక్ లను ప్రారంభించామన్నారు. విద్యార్థిని, విద్యార్థుల రక్షణ దృష్ట్యా షీ-టీం బృందాలు స్కూల్స్, కళాశాల, బస్ స్టాండ్ ప్రాంతాలలో నిఘా వేసి ఉంటాయన్నారు. ఎలాంటి అత్యవసర సమయంలోనైన డయల్​ 100 చేయాలని ఎస్పీ చెన్నూరి రూపేష్ సూచించారు. 
 
ఈ కార్యక్రమంలో రాయల్ కళాశాల ప్రిన్సిపల్ కృపానిధి, యువజన సంఘాల నాయకులు కూన వేణు, రాయల్ కళాశాల, శ్రీతేజ కళాశాల, ప్రభుత్వ మహిళా కళాశాలల లెక్చరర్స్ విద్యార్థిని, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.