రామోజీరావు అస్తమయం ప్రముఖుల నివాళులు
Ramoji Rao Astamayam Tributes of Celebrities
నా తెలంగాణ, హైదరాబాద్: ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) మృతి పట్ల రాష్ర్టపతి ద్రౌపదీ ముర్మువిచారం వ్యక్తం చేశారు. రామోజీ మరణంతో మీడియా, వినోద, పత్రికా రంగంలో ఓ టైకూన్ ను కోల్పోయామని సంతాపం వ్యక్తం చేశారు. తన జీవితంలో దూరదృష్టితో ఎన్నో విజయాలు సాధించి సమాజంలో చెరగని ముద్ర వేశారని తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారు: మోదీ..
రామోజీరావు మరణం ఎంతో బాధకరమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మీడియా రంగంలో ఆయన విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన దార్శనికుడని కొనియాడారు. పత్రికా రంగంలో నూతన ఒరవడిని సృష్టించిన ఘనత ఆయనకు దక్కుతుందన్నారు. ఆయనకు అపారమైన జ్ఞాన సంపద ఉండేదన్నారు. రామోజీ మృతి బాధాకరమన్నారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, అసంఖ్యాక అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
కేంద్రమంత్రి అమిత్ షా..
మీడియా దిగ్గజం, ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు మరణం విచారకరం. మీడియా నుంచి ఆర్థిక రంగం వరకు.. విద్య నుంచి పర్యాటకం వరకు తాను పనిచేసిన అనేక రంగాల్లో తన సృజనాత్మకతతో ఎన్నో సానుకూల ప్రమాణాలను తీసుకొచ్చారు. ఇప్పుడు భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ఆయన కృషి తరతరాలకు స్ఫూర్తినిస్తుంది. ఈ విచారకర సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు కేంద్రమంత్రి అమిత్ షా సానుభూతిని తెలిపారు.
సంస్కరణలకు ఆద్యుడిని కోల్పోయాం: కిషన్ రెడ్డి..
మీడియా మేరునగధీరుడిగా, సమాచార రంగంలో విలువలతో కూడిన నూతన ఒరవడులకు, ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టిన మహనీయుడు రామోజీరావు ఇక లేరని తెలిసి బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేస్తూ.. ఎందరోమంది జీవితాల్లో వెలుగులు నింపిన రామోజీరావు అస్తమయం తెలుగు మీడియా రంగానికి, టీవీ పరిశ్రమకు, తెలుగు రాష్ట్రాలకు తీరని లోటని కిషన్ రెడ్డి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
రామోజీ మరణం తీరని లోటు: చంద్రబాబు..
సామాన్య కుటుంబంలో జన్మించి అసామాన్య విజయాలు సాధించిన రామోజీరావు మరణం తీవ్ర ఆవేదనకు గురి చేసింది. కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన తిరిగి కోలుకుంటారని భావించా.. కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదు. తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారు. ఆయన తెలుగు ప్రజల ఆస్తి. ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికే తీరని లో అని టీడీపీ అధినేత చంద్రబబునాయుడు అన్నారు.
క్రమశిక్షణలో మేటి: వెంకయ్యనాయుడు
ఆత్మీయుడు రామోజీ మరణవార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యా. క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధతలతో అడుగుపెట్టిన ప్రతి రంగంలో ఆయన సృష్టించిన నూతన ఒరవడి ఆదర్శనీయం. తెలుగు భాష, సంస్కృతులకు ఆయన చేసిన సేవ చిరస్మరణీయం. ఆయన ఓ వ్యక్తి కాదు.. శక్తిమంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన ఆయన జీవితం నుంచి యువతరం ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. ఆయన లేని లోటు పూడ్చలేనిది అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం, సానుభూతి వ్యక్తం చేశారు.