మీడియా మొఘల్ కన్నుమూత
జర్నలిజంలో నూతన ఒరవడి సమాజ శ్రేయస్సుకు కృషి వేలమంది కళాకారులకు ఉపాధి
నా తెలంగాణ, హైదరాబాద్: మీడియా మొఘల్ గా పేరు పొందిన రామోజీరావు కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో ఆయన శనివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. జర్నలిజం రంగంలో ఈనాడు పత్రికను స్థాపించి నూతన ఒరవడిని సృష్టించారు. తెలుగు భాష అభివృద్ధికి ఆయన విశేష సేవలందించారు. సమాజ శ్రేయస్సుకు అహార్నిశలు పాటుపడ్డారు. పత్రికా రంగంతోపాటు రామోజీ గ్రూప్ సంస్థలను స్థాపించి ఎంతోమందికి ఉపాధి కల్పించారు. ఇక సినీ రంగం అభివృద్ధి కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. సమాజానికి దిశానిర్దేశం చేసే పలు చిత్రాలు, కార్యక్రమాలను రూపొందిచారు. రామోజీరావుకు మూడు రోజుల క్రితమే గుండెకు సంబంధించిన ఆపరేషన్ జరిగినట్లు కుటుంబీకులు తెలిపారు. అప్పటి నుంచి ఆయన వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారని తెలిపారు. ఆదివారం ఉదయం ఫిల్మ్ సిటీలోనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి..
రామోజీరావు మృతిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. జర్నలిజానికి, పారిశ్రామిక రంగానికి విలువలతో కూడిన సేవలు అందించారని తెలిపారు. తెలుగు పత్రికా, మీడియా రంగానికి రామోజీరావు లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. రామోజీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు..
రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీడబ్ల్యూసీ సమావేశాల కోసం ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఏర్పాట్లు పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, సైబరాబాద్ కమిషనర్‌కు సీఎస్ లకు ఆదేశించారు.
కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబరు 18న ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో రామోజీరావు జన్మించారు. నిబద్ధత, క్రమశిక్షణ, కష్టపడే తత్వం వల్ల జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి ఎదిగగలిగారు.