ఐక్యతను విచ్ఛిన్నం చేసే వ్యాఖ్యలా? రాహుల్ పై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మండిపాటు
Comments that break unity? Union Minister G. Kishan Reddy's anger on Rahul
నా తెలంగాణ, హైదరాబాద్: భారత ప్రజలు, విధానంపై రాహుల్ గాంధీ విదేశాల్లో చేసిన వ్యాఖ్యలను తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. మంగళవారం సామాజిక మాధ్యమం వేదికగా ఆయనపై ఫైర్ అయ్యారు. ఎప్పుడూ ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలే లక్ష్యంగా చేసుకునే రాహుల్ గాంధీ భిన్నత్వంలో ఏకత్వమైన భారత ఐక్యతను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. సంరక్షించే వారినే అసహ్యించుకోవడం ఆయనకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజనే అతని ఏజెండాగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఓ వైపు జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఎన్సీతో పొత్తుపెట్టుకొని లేనిపోని ఆరోపణలు చేస్తూ దేశ ఐక్యతను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. సిక్కుల మారణాకాండ, దళిత రిజర్వేషన్లు, ఆర్టికల్ 370 రద్దు లాంటి సున్నిత అంశాలపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడాన్ని ఖండించారు. రాహుల్ గాంధీ విభజన ఏజెండాకు భారత్ లో స్థానం లేదని జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు.