నా తెలంగాణ, హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రామచందర్ 2024 సంవత్సరానికి గాను తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ ప్రకటించిన గ్లోబల్ పీస్ అవార్డును శనివారం అందుకున్నారు.
అవార్డు గ్రహీత రాంచందర్ గత 30 ఏళ్లకు పైగా జర్నలిజంలో కొనసాగుతూ, ప్రజా సమస్యలను పత్రిక ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. పొలిటికల్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ సాధించిన రామచందర్ శనివారం ఉదయం తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు డాక్టర్ రాజనారాయణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రకటించిన ఈ అవార్డును శాసనమండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండ ప్రకాష్ చేతుల మీదుగా అందుకున్నారు.
ప్రస్తుతం ఆయన సాక్షి దినపత్రిక పాతబస్తీ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. కేవలం వార్తా సేకరణలోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొంటున్న ఆయన పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీతో పాటు అన్నదాన కార్యక్రమాలు, పేద విద్యార్థులకు నోట్ పుస్తకాలు పంపిణీ చేస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్నారు.
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ లో సీనియర్ ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. హైదరాబాద్ జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ అఫీషియల్ సభ్యులుగా కొనసాగుతున్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్ గా పనిచేసే ఈ అక్రిడిటేషన్ కమిటీలో సీనియర్ జర్నలిస్టుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు అవార్డులు, ప్రశంసలు అందుకున్న రామచందర్ కు ఈసారి గ్లోబల్ పీస్ అవార్డు లభించడం పట్ల పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలిపారు.
రాంచందర్ కు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య అభినందనలు తెలిపారు.