కాళేశ్వరంపై చర్చకు సిద్ధమా
కేసీఆర్ కు కోదండరాం సవాల్
నా తెలంగాణ, హైదరాబాద్: కాళేశ్వరంపై బీఆర్ఎస్ అబద్దాలు చెబుతోందని, కాగ్ చెప్పిన వాస్తవాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సవాల్ విసిరారు. ఆదివారం కోదండరాం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంతో ఉపయోగం లేదని తెలిసినా కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఐక్యరాజ్య సమితికి పని చేసిన హన్మంతరావు సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టొద్దన్నప్పటికీ కేసీఆర్ తన మొండివైఖరితో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల వల్ల కేవలం తన పరివారానికి, కాంట్రాక్టర్లకు మాత్రమే లాభం చేకూరిందని ఆరోపించారు. గంపగుత్తగా పనులను కేటాయించడం వెనుక అవినీతిని కూడా కాగ్ స్పష్టంగా బయటపెట్టిందన్నారు. ఒక ఎకరాకు నీరందించేందుకు రూ.46 వేల రూపాయలు ఖర్చవుతోందని, 60 శాతం విద్యుత్ కాళేశ్వరం నిర్వహణకే అవసరం అవుతోందన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణం వల్ల భూకంపాలు సంభవించే ప్రమాదం ఉందన్నారు. కొండపోచమ్మ కాలువకే రూ.70 కోట్లు ఖర్చు చేశారని, మట్టి కూడా కొట్టుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డ పియర్లు కుంగాయి ప్రాజెక్టు ఎలా నిలబడుతుందని ప్రశ్నించారు. రూ.87 వేల కోట్ల అప్పుచేసి ప్రజల నెత్తిన భారం వేసి ఆర్థికంగా తెలంగాణను దివాళా తీసే స్థాయికి కేసీఆర్ చేర్చారని కోదండరాం దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని కోదండరాం డిమాండ్ చేశారు.