వారసత్వ ప్రదేశాలే జాతి అస్తిత్వ చిహ్నాలు 

Heritage sites are symbols of ethnic identity

Jul 30, 2024 - 12:01
 0
వారసత్వ ప్రదేశాలే జాతి అస్తిత్వ చిహ్నాలు 

మన దేశంలోని అహోం చక్రవర్తుల సమాధులకు తాజాగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్  గుర్తింపు లభించింది. ఈ సమాధులకు కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదా ఇస్తున్నట్లు యునెస్కో ప్రకటించింది. ఈ సమాధులకు ఏడు వందలకు పైగా చరిత్ర ఉంది.  బ్రిటిషర్ల రాకకు ముందు తూర్పు అసోం ప్రాంతాన్ని అహోం రాజులు పరిపాలించారు.  2021లో  రామప్ప ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. 2021లో చైనాలో జరిగిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం రామప్ప ఆలయాన్ని  అద్భుతమైన వారసత్వ కట్టడండా యునెస్కో గుర్తించింది. రామప్ప ఆలయానికి  వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం,  నిర్మాణంలో  వాడిన రాళ్లు నేటికీ రంగును కోల్పోకపోవడం. ఇవీ రామప్పకు వారసత్వ హోదా గుర్తింపు రావడంలో కీలకంగా మారిన మూడు అంశాలు. వారసత్వ ప్రదేశాలు మన జాతి అస్విత్త చిహ్నాలు. వాటిని కాపాడుకోవడంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి.

మన పూర్వీకుల నుంచి మనకు వచ్చేదే వారసత్వం. పూర్వీకుల నుంచి అందే  వారసత్వాన్ని మనం కాపాడుకోగలగాలి.  రేపటితరానికి  తాజాగా మన దేశంలోని అహోం చక్రవర్తుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్  గుర్తింపు లభించింది.  యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అహోం చక్రవర్తుల సమాధులంటే నిన్నా మొన్నటివి కాదు. ఏడు వందలకు పైగా చరిత్ర ఉంది ఈ సమాధులకు. ఇవి.. అసోంలోని అహోం రాజవంశానికి చెందిన చెందిన పురాతన కాలంనాటి మట్టి దిబ్బలు. ఈ సమాధులను మోయిదమ్ అంటారు అసోం ప్రజలు. ఎంతో ఘనమైన వారసత్వ సంపదకు ఇన్నేళ్లుగా  అహోం చక్రవర్తుల సమాధులు చిరునామాగా ఉన్నాయి. తాజాగా ఈ సమాధులకు కల్చరల్ ప్రాపర్టీ కేటగిరీలో ప్రపంచ వారసత్వ ప్రదేశ హోదా ఇస్తున్నట్లు యునెస్కో ప్రకటించింది. అహోం చక్రవర్తుల సమాధులకు యునెస్కో వరల్డ్ హెరిటేజ్  గుర్తింపు లభించడం పట్ల అసోం ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. దీనికి కారణ...ఈశాన్య భారతం నుంచి యునెస్కో హెరిటేజ్‌లో చోటు దక్కిన తొలి రాష్ట్రంగా అసోం రికార్డు సృష్టించింది. అహోం చక్రవర్తుల సమాధులకు ఘనమైన చరిత్ర ఉంది. బ్రిటిషర్ల రాకకు ముందు తూర్పు అసోం ప్రాంతాన్ని అహోం రాజులు పరిపాలించారు. అయితే అహోం చక్రవర్తులు చనిపోయిన తరువాత వారి సమాధులను కాపాడాలని వారి వారసులు నిర్ణయించుకున్నారు.  మట్టి. ఇటుక, రాళ్లను ఉపయోగించి బోలు సొరంగం మాదిరిగా సమాధులను నిర్మించారు. వీటిలో అహోం చక్రవర్తుల అలాగే వారి రాణుల ఖననం కూడా జరిగింది.  ఖననానికి సంబంధించి ప్రతి జాతి కొన్ని ఆచారాలను పాటిస్తుంది. ఈ విషయంలో ఈజిప్షియన్ల పేరు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఈజిప్షియన్ల తరహాలోనే అహోం చక్రవర్తులు కూడా ఖనన ఆచారాలను తూ.చ తప్పకుండా పాటించారు. అందుకే అహోం చక్రవర్తుల సమాధులకు పిరమిడ్స్ ఆఫ్‌ అసోం పేరుతో కూడా పిలుస్తుంటారు.

 2021లో రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు

రామప్ప ఆలయం.. అద్భుత శిల్పకళా సంపదకు చిరునామా. కాకతీయుల కళా వైభవాన్ని చాటిచెప్పిన ఆలయం ఇది. ఇంతటి ఘన చరిత్ర గల రామప్ప ఆలయానికి ఎప్పుడో అంతర్జాతీయ ఖ్యాతి రావాల్సింది.  అయితే అలా జరగలేదు. చివరకు 2021లో  రామప్ప ఆలయానికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. కాకతీయుల కళావైభవాన్ని చాటిన ఆలయాన్ని మూడేళ్ల కిందట యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం ఉద్దేశించిన ప్రపంచ హెరిటేజ్ కమిటీ 44వ సమావేశం చైనాలోని పూజౌలో 2021 జులై  16న ప్రారంభమైంది. అయితే 2020  జూన్‌లోనే ఈ సమావేశం జరగాల్సి ఉంది. కానీ  కొవిడ్  కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది. పూజౌలో  జరిగిన సమావేశంలో 2020 అలాగే 2021 సంవత్సరాలకు గానూ.. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు.. యూనెస్కో పరిశీలనకు ఎంపికయ్యాయి. కాగా.. భారత్‌ నుంచి రామప్ప ఆలయానికి  యునెస్కో గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం  భారతదేశం నుంచి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం 2020 సంవత్సరానికి ప్రతిపాదనలు పంపింది. ఎనిమిది శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా మూడు అంశాలను ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. అవి ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడే ఇటుకలతో గోపుర నిర్మాణం, నిర్మాణంలో వాడిన రాళ్లు నేటికీ రంగును కోల్పోకపోవడం. ఇవీ రామప్పకు వారసత్వ హోదా గుర్తింపు రావడంలో కీలకంగా మారిన మూడు అంశాలు. తెలంగాణలోని ప్రస్తుత ములుగు జిల్లా  పాలంపేట గ్రామంలో ఉన్నది  రామప్ప దేవాలయం. ఈ అపురూప ఆలయాన్ని  క్రీ.శ. 1213లో కాకతీయ ప్రభువు గణపతిదేవుని సైన్యాధ్యక్షుడు రేచర్ల రుద్రుడు నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. రేచర్ల రుద్రుడు పరమ శివ భక్తుడు. శివుడిపై ఉన్న అపారమైన భక్తితో రుద్రుడు ఈ ఆలయాన్ని కట్టించాడు. రామప్ప  ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 40 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయ నిర్మాణ బాధ్యతలు రామప్ప అనే మహాశిల్పి చేపట్టాడు. ఇప్పుడు ఈ ఆలయం ఆయన పేరునే ప్రాచుర్యంలోకి వచ్చింది. మహోత్కృష్టమైన శిల్ప ఖండాలు ఈ ఆలయంలో కోకొల్లలుగా ఉన్నాయి. పాలంపేట ప్రాంతంలోని  నేల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్మాణంలో  ప్రత్యేక టెక్నాలజీని వాడారు. నేల స్వభావాన్ని బట్టి ఆలయం బరువును తగ్గించేందుకు అత్యంత తేలికైన ఇటుకలను తయారు చేశారు. అందుకే ఇవి తక్కువ బరువు కలిగి ఉండి నీటిలో తేలియాడుతాయి. ఇలాంటి ఇటుకలతో దేశంలో మరెక్కడా నిర్మాణాలు లేవని చరిత్రకారులు పేర్కొంటారు.  ఆలయం లోపల నాట్యమంటపం ఆనాటి శిల్ప కళా వైభవానికి తార్కాణంగా నిలుస్తున్నది. మొత్తానికి తెలంగాణ శిల్ప కళా సంపదకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకువచ్చింది కాకతీయల నాటి రామప్ప దేవాలయం.

చారిత్రక కట్టడాలకు నెలవు భారత్

వారసత్వ ప్రదేశాలు  మన జాతి అస్విత్త చిహ్నాలు.  దేశంలో అనేక గొప్ప చారిత్రక కట్టడాలున్నాయి. వీటిలో అద్భుతమైన రాజ ప్రసాదాలు, ఉల్లాసాన్ని కలిగించే  గొప్ప  ప్రకృతి దృశ్యాలు, సుందర ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వీటిని పరిరక్షించుకోవడం మన బాధ్యత. ఒక దేశ గొప్పతనం, నాగరికత,  సంస్కృతీ సంప్రదాయాలు అన్నీ.. ఈ వారసత్వ ప్రదేశాలతోనే ముడిపడి ఉంటాయి. మనదేశంలోని వారసత్వ ప్రదేశాలు.. మొత్తం 19 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఎక్కువగా మహారాష్ట్రలో ఐదు వారసత్వ ప్రదేశాలున్నాయి. అజంతా ఎల్లోరా గుహలు, ఆగ్రా కోట, తాజ్ మహల్, కోణార్క్‌ సూర్య దేవాలయం, ఖజురహో, ఖజరంగా నేషనల్ పార్క్‌, ఫతేపూర్ సిక్కీం, కుతుబ్ మినార్, తమిళనాడు, కర్ణాటకలోని అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటితో పాటు మన  రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక వారసత్వ ప్రదేశాలు, సంపదలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం.  మనదేశం.. అద్భుత శిల్ప కళావేదికకు చిరునామా.  అయితే విదేశీయుల దండయాత్రల ఫలితంగా మన అద్భుత శిల్ప కళా సంపద చాలావరకు కాలగర్భంలో కలిసిపోయింది.  అంతేకాదు.. అనేక విలువైన విగ్రహాలను ఇతర దేశాలకు తరలించారు ముష్కరులు. వారసత్వ సంపద కాపాడుకోవడానికి ప్రభుత్వ సంస్థలతోపాటు నిఘా సంస్థలు కూడా మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. శిథిలావస్థకు చేరుకుంటున్న కట్టడాలు, నిర్మాణాల పరిరక్షణకు ప్రభుత్వాలు తగిన నిధులు మంజూరు చేయాలి.  తగిన  సంరక్షణ లేక అనేక చారిత్రక కట్టడాలు దెబ్బతింటున్నాయి. మనదేశంలో  మొత్తం 42 ప్రపంచ వారసత్వ స్థలాలు, కట్టడాలు ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క తెలంగాణలోని రామప్ప ఆలయమే యునెస్కో వారసత్వ ప్రదేశాల జాబితాలో  చోటు దక్కించుకుంది. తెలుగు రాష్ట్రాల్లో  చారిత్రక ప్రాధాన్యం కలిగిన ప్రదేశాలెన్నో ఉన్నాయి. అయితే, అవి తగిన గుర్తింపునకు నోచుకోవడం లేదు. ఈ విషయంలో పాలకులు తగిన శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది.

ఎస్‌. అబ్దుల్ ఖాలిక్, 
సీనియర్ జర్నలిస్ట్ 
6300 174 320