వార్​ వన్​ సైడే

రాజస్థాన్​ లో పార్టీ వీడుతున్న హస్తం దిగ్గజ నేతలు కమలంలో చేరేందుకు ముహూర్తం ఖరారు కాంగ్రెస్​ కు డిపాజిట్లు కూడా గగనమే? 2019లాగా రిక్త హస్తమే శరణ్యం!

Feb 18, 2024 - 20:41
 0
వార్​ వన్​ సైడే

జైపూర్​: రాజస్థాన్​ రాజకీయాల్లో ఇప్పటికే హస్తం పార్టీకి షాక్​ ల మీద షాక్​ లు తగులుతున్నాయి. తాజాగా మరో కాంగ్రెస్​ పార్టీ దిగ్గజ నేత పార్టీని వీడతారనే ప్రచారం ఊపందుకోవడంతో పార్టీలో కలవరం రేగుతోంది. ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతుండడంతో కాంగ్రెస్​ పార్టీలో అంతర్మథనం మొదలైంది. రాజస్థాన్​ సీడబ్ల్యూ సీ సభ్యుడు బగిదౌరా ఎమ్మెల్యే మహేంద్ర జిత్​ సింగ్​ మాలవీయ, మాజీ మంత్రులు లాల్ చంద్ కటారియా, ఉదయ్ లాల్ అంజనా, మాజీ ఎమ్మెల్యే రిచ్ పాల్ మిర్ధా బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. వీరితోబాటు  కాంగ్రెస్ మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎస్సీ కమిషన్ చైర్మన్ ఖిలాడీ లాల్ బైర్వా కూడా కమలంలో చేరనున్నారనే టాక్​ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా బీజేపీ పెద్దలతో విజయవంతంగా ముగిసినట్లు సమాచారం. దిగ్గజ నేతలు రాజస్థాన్​ లో పార్టీని వీడుతుండడంతో రానున్న ఎంపీ ఎన్నికల్లో ‘వార్​ వన్​ సైడ్​’గానే కనిపిస్తోంది. 

రాజస్థాన్​ లో మొత్తం 25 ఎంపీ స్థానాలున్నాయి. 2019న జరిగిన లోక్​ సభ ఎన్నికల్లో బీజేపీ 24 స్థానాలతో క్లీన్​ స్వీప్​ చేయగా, రాష్ర్టీయ లోక్​ తాంత్రిక్​ పార్టీ 1 స్థానాన్ని సాధించగా కాంగ్రెస్​ పార్టీకి రిక్తహస్తమే మిగిలింది. ఈసారి కూడా కాంగ్రెస్​ పార్టీని దిగ్గజ నేతలు వీడీ బీజేపీలో చేరుతుండడంతో ఆ పార్టీ పోటీ చేసే స్థానాల్లో డిపాజిట్లు కూడా గగనమే అనే వాదన వినిపిస్తుంది.

గెహ్లాట్​ పై ఆరోపణలు..
కాంగ్రెస్​ పార్టీని భ్రష్టు పట్టించడంలో మాజీ సీఎం అశోక్​ గెహ్లాట్​ ముఖ్యభూమిక పోషించారని ఆ పార్టీ నేత లాల్​ బైర్వా ఆరోపించారు. నేతలంతా ఇతర పార్టీలోకి వెళ్లేందుకు గెహ్లాట్​ వ్యవహారశైలే కారణమని మండిపడ్డారు. కాగా బైర్వాను సచిన్​ పైలెట్​ వర్గానికి చెందిన నేతగా చెబుతుంటారు. అందుకే ఆరోపణలు చేశారని చెబుతున్నారు. ఏది ఏమైనా రాజస్థాన్​ లో కాంగ్రెస్​ వ్యవహారశైలితో దిగ్గజ నేతలు వీడడంతో ఇక్కడ మరోమారు 25 స్థానాల్లో కమల వికాసం పక్కా అనే వాదన వినబడుతోంది.