శివపురి అటవీలో 200 గోమాతల కళేబరాలు
నోరు మెదపని అధికారులు నివేదిక కోరిన ప్రభుత్వం రంగంలోకి అటవీశాఖ, మండల, పోలీసు శాఖ ఉన్నతాధికారులు
భోపాల్: మధ్యప్రదేశ్ లని శివపురి జిల్లా కరేరా తహసీల్ పరిధిలోని సిలార్పూర్ గ్రామీణ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న అడవిలో 200కు పైగా ఆవుల (గోమాతల) కళేబరాలు లభించడం కలకలం సృష్టిస్తోంది. ఈ ఘటనపై అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. కళేబరాలను పరిశీలించిన అధికార యంత్రాంగం ఎవరో తీసుకువచ్చి ఇక్కడ పడవేసి వెళ్లారా? లేక గోమాతలను తీసుకువచ్చి విష ప్రయోగానికి పాల్పడి చంపేశారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గోవధపై నిషేధం నేపథ్యంలో ఈ సంఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.
గోవుల కళేబరాలు లభించిన ప్రాంతంలో అధికారులు విచారణ చేపట్టినప్పటికీ ప్రస్తుతం (ఆదివారం) వరకు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. ఈ ఆవుల కళేబరాలు ఇక్కడకు ఎలా వచ్చాయనేది దానిపై అనేక ప్రశ్నలకు అధికారులు వెతికే పనిలో పడ్డారు. మరోవైపు ఈ ఘటనపై అధికార యంత్రాంగంపై ఎంపీ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. వెంటనే ఈ ఘటనపై విచారణ చేపట్టి పూర్తి నివేదికను అందించాలని ఆదేశించింది.
కాగా అటవీ ప్రాంతంలో గోవుల కళేబరాలు లభించడం పట్ల అటవీశాఖాధికారులకు కూడా తెలియకపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా ఒక కళేబరం ఉంటేనే ఆ ప్రాంతంలో తీవ్రమైన దుర్వాసనలు వస్తాయి. అలాంటిది ఏకంగా 200కు పైగా కళేబరాలు ఉన్నచోటు అధికారులకు ఎలా తెలియరాలేదనే ప్రశ్నలు కూడా పలువురు లేవనెత్తుతున్నారు.
ఈ ఘటనపై ప్రభుత్వం నివేదిక కోరడంతో మండల అధికారులతోపాటు, అటవీశాఖ, పోలీసు శాఖల ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. పెద్ద ఎత్తున విచారణకు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణలో నిమగ్నమయ్యారు. గ్రామస్థులతో పలు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న మాంసం వ్యాపారులను కూడా ప్రశ్నిస్తున్నారు.
ఆవుల కళేబరాలు పడి ఉండడంపై డెయిరీ అధికారి ఎంసీ తమౌరీ మాట్లాడుతూ.. ఇక్కడ లభించిన కళేబరాలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఏ గోశాలకు, డెయిరీ సంస్థలకు చెందినవి కావని వివరించారు. ఈ కళేబరాలపై పూర్తి విచారణ అనంతరమే నిజాలు నిగ్గు తేలుతాయని ఆయన పేర్కొన్నారు.
ఏది ఏమైనా గోమాతలపై కర్కశత్వంపై భారత ప్రభుత్వం గతంలోనే పలు పటిష్ట చట్టాలను చేసినప్పటికీ, కొందరు చేస్తున్న దుశ్చర్యల వల్ల వాటి రక్షణ కత్తిమీద సాములా మారుతోంది.