వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య సీబీఐ అదుపులో నిందితుడు
సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నం విద్యార్థుల ఆరోపణ, సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న సమ్మె
కోల్‌కతా: ఆర్జీకర్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థిని అత్యాచారం, హత్య కేసులో ప్రభుత్వం, ఆసుపత్రి యంత్రాంగం తీరుపై రోజురోజుకు విమర్శలు, ఆరోపణలు ఎక్కువవున్నాయి. సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారని బుధవారంవైద్య విద్యార్థులు ఆరోపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఆసుపత్రిలోని గోడలను బద్ధలు కొట్టిన వీడియోలను షేర్ చేశారు. హత్య జరిగిన ఆసుపత్రిలో పునరుద్ధరణ పేరుతో సెమినార్ హాల్ కు 20మీటర్ల దూరంలో ఈ పనులు చేపట్టడం సాక్ష్యాలను తారు మారు చేయడమేనని అన్నారు.
అదే సెమినార్ హాల్ లో వైద్య విద్యార్థిని మృతదేహం లభించింది. దీంతో విద్యార్థుల ఆరోపణలకు బలం చేకూరుతోంది.
కాగా బుధవారం ఉదయం సీబీఐ నిందితుడు సంజయ్ ను అదుపులోకి తీసుకుంది. పోలీసులు, అధికారుల నుంచి కేసుకు సంబంధించిన వివరాల ఫైళ్లను స్వాధీనం చేసుకొని విచారణకు సమాయత్తం అవుతోంది.
ఇదిలా ఉండగా, ట్రైనీ వైద్య విద్యార్థుల సంఘం ఫోర్డా చేపట్టిన ఆందోళనలు మూడో రోజుకు చేరుకున్నాయి.
కోల్ కతా, అసోం, ఢిల్లీ సహా పలు ప్రాంతాలలో జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. తమ భద్రతకు కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో అత్యాచారం, హత్య కేసులో పర్తి నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. వీరి సమ్మెతో రోజువారీ రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.