మతమార్పిళ్లపై కొరడా ఛత్తీస్ గఢ్ అసెంబ్లీలో త్వరలో బిల్లు
ఛత్తీస్ గఢ్ లో ఇక మతమార్పిడులపై ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. చట్టవిరుద్ధ మతమార్పిడి నిరోధక బిల్లు ముసాయిదాను సిద్ధం చేసింది. త్వరలో అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు.
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లో ఇక మతమార్పిడులపై ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. చట్టవిరుద్ధ మతమార్పిడి నిరోధక బిల్లు ముసాయిదాను సిద్ధం చేసింది. త్వరలో అసెంబ్లీలో ఈ బిల్లు ప్రవేశ పెట్టనున్నారు. ప్రవేశ పెట్టేముందు ప్రతిపక్షాలు, సామాన్య పౌరులతో కూడా పలు సూచనలు, సలహాలు కోరాలా? వద్దా? అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ చట్టం ప్రకారం ఇతర మతంలోకి మారాలనుకునే వ్యక్తి వ్యక్తిగత వివరాలతో ఒక డిక్లరేషన్ ఫారం 60 రోజుల ముందు జిల్లా మేజిస్ట్రేట్ కు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అసలు ఉద్దేశం, కారణం, ఉద్దేశాన్ని అంచనా వేయాలని పోలీసులను మేజిస్ర్టేట్ కోరతారు. పోలీసుల సవివరణ విచారణ అనంతరం నివేదిక సమర్పిస్తారు. అటు పిమ్మట మత మార్పిడికి మార్గం సుగమం, చట్టబద్ధం కానుంది.
చట్టబద్ధతకే బిల్లు: కేంద్రమంత్రి బ్రిజ్ మోహన్..
ఇటీవలే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రమంత్రి బ్రిజ్ మోహన్ అగర్వాల్ కూడా ఈ బిల్లుపై మీడియాతో వివరాలను పంచుకున్నారు. గత కాంగ్రెస్ హయాంలో ఇష్టారీతిన మతమార్పిళ్లు కొనసాగాయన్నారు. వాటికి చట్టబద్ధత చేకూర్చలేదన్నారు. తమ ప్రభుత్వం మతమార్పిళ్లపై చట్టబద్ధత కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ చట్టాన్ని రూపొందించే పనిలో ఉందన్నారు.
34 కేసులు, 3400 పైగా ఫిర్యాదులు..
ఛత్తీస్ గఢ్ లో మతమార్పిడి కారణంగా జనాభాలోను మార్పు చేర్పులు గుర్తించారు. వీటిపై పలు హిందూ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నప్పటికీ పట్టించుకోలేదు. ఇప్పటికే మతమార్పిడులపై వివిధ వర్గాల నుంచి 34 కేసులు నమోదు కాగా 3400కు పైగా ఫిర్యాదులు అందాయి. మతమార్పిళ్లలో అధికార దుర్వినియోగం, బెదిరింపులు, పలుకుబడి, బలవంతం, ప్రలోభాలు, మోసపూరిత మార్గాలు, వివాహం సాకుతో ఆచారాల ముసుగులో ఒక మతం నుంచి మరొక మతంలోకి మతమార్పిడి చేయకూడదని ముసాయిదా మతమార్పిడి బిల్లులో పలు అంశాలను పొందుపరిచారు. ముసాయిదా ప్రకారం మతం మారిన ప్రతి ఒక్కరి వివరాలను మేజిస్ర్టేట్ కు సమర్పించనున్నారు. అనుమానాస్పద మతమార్పిళ్లపై నాన్ బెయిలబుల్ కేసులు, ఎఫ్ ఐఆర్ లు కూడా నమోదుకు అవకాశం కల్పించారు.
నాన్ బెయిలబుల్ కేసులు..
మతమార్పిడికి పూనుకున్న వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేస్తే అందుకు కారణమైన వారిపై నాన్ బెయిలబుల్ కింద కేసులు నమోదు చేయనున్నారు. ఈ చట్టం ప్రకారం పదేళ్ల జైలు శిక్ష రూ. 50 వేల జరిమానా కూడా విధించే అవకాశం ఉంది. మైనర్లు, మహిళలు లేదా షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగలు చట్టవిరుద్ధంగా మతమార్పిడికి పాల్పడేవారికి కనీసం రెండేళ్లు, గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది. దీనితో పాటు కనీసం రూ.25,000 జరిమానా విధిస్తారు. చట్టవిరుద్ధంగా మతమార్పిడి చేస్తే కనీసం మూడేళ్లు లేదా గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తారు. మత మార్పిడులకు గురైన బాధితురాలికి సెషన్స్ కోర్టు రూ.5 లక్షల వరకు పరిహారం మంజూరు చేయనున్నారు.
ఘర్ వాపసీకి తొలుత ప్రచారం దిలీప్ సింగ్ జూడియోదే..
మత స్వేచ్ఛ దుర్వినియోగంపై ఇటీవలే రాష్ర్ట స్వయంసేవక్ సంఘ్ విచార్ పరివార్ కు చెందిన వనవాసి కల్యాణ్ ఆశ్రమం గిరిజనుల మధ్య ప్రచారాన్ని నిర్వహించగా, ధరమ్ జాగరణ్ మంచ్, హిందూ జాగరణ్ మంచ్ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఛత్తీస్ గఢ్ లో మాజీ కేంద్ర మంత్రి, జష్ పూర్ రాజకుటుంబానికి చెందిన దిలీప్ సింగ్ జూడియో తన జిల్లాలో ‘ఘర్ వాపసీ’ ప్రచారాన్ని తొలుత ప్రోత్సహించారు.