రైసీ అంత్యక్రియలు పూర్తి
68 దేశాల ప్రముఖులు హాజరు భారత్ తరఫున ఉపరాష్ర్టపతి ధనకర్
టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అధ్యక్షుడు పుట్టిన నగరం మషాద్ లో ఆయనను గురువారం ఖననం చేశారు. అంత్యక్రియలకు భారీ ఎత్తున నల్లటి దుస్తులు ధరించి ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. మషాద్ వీధులన్నీ జనాలతో నిండిపోయింది. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఉదయమే ఆయన కుటుంబ సభ్యులు మషాద్ కు చేరుకున్నారు. అంత్యక్రియల్లో హాజరయ్యేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు 68 మంది ప్రముఖులు హాజరయ్యారు.
భారత్ నుంచి ఉపరాష్ర్టపతి జగదీప్ ధనకర్ అంత్యక్రియలకు హాజరయ్యారు. ఖాతార్ ఎమిర్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, ఇరాక్ ప్రధాని మహ్మద్ షియా అల్ సుడానీ, పాక్ పీఎం షాబాజ్ షరీఫ్, హౌతీ, హమాస్ గ్రూప్ ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
రైసీతో సహా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారందరికీ వీడ్కోలు పలికేందుకు, వారి మృతదేహాలను వాహనంలో ఉంచి నగరం చుట్టూ ప్రజల సందర్శనార్థం వీడ్కోలు పలికేందుకు అవకాశం కల్పించారు. ప్రజలు పెద్ద ఎత్తున రైసీకి నివాళులర్పించారు.
అంత్యక్రియల ప్రక్రియను సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నేతృత్వంలో ప్రారంభించారు. శవపేటికలను టెహ్రాన్ విశ్వవిద్యాలయంలో ఉంచారు.
ఇబ్రహీం రైసీతోపాటు మరో 8మంది మే 19న హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంపై భిన్నవాదనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ చేపట్టింది.