సైబర్ ఉచ్చు.. లావోస్ నుంచి 13 మంది సురక్షితంగా తరలింపు
కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ కృషికి కుటుంబ సభ్యుల కృతజ్ఞతలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ఉద్యోగాల ముసుగులో సైబర్ ఉచ్చులో చిక్కుకొని లావోస్ లో తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్న 13 మందిని ఆదివారం సురక్షితంగా భారత్ కు తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ నేతృత్వంలో లావోస్ విదేశాంగ శాఖ, ప్రభుత్వంతో పలుమార్లు చర్చల అనంతరం ఈ 13మందిని సురక్షితంగా తీసుకురాగలిగారు. ఇప్పటివరకూ విదేశాంగ శాఖ 518మంది భారతీయులను విదేశాలనుంచి సురక్షితంగా తీసుకువచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
పలువురు మోసపూరిత ఏజెంట్ల ప్రకటనలను నమ్మిన వీరంతా ఉద్యోగ వేటలో లావోస్ కు వెళ్లారు. అక్కడకు వెళ్లాక స్థానిక ఏజెంట్ల ఉచ్చులో చిక్కుకున్నారు. వీరిని సైబర్ స్కామ్ కు పాల్పడాలని బెదిరింపులకు గురి చేస్తున్నారు. 13మంది సోషల్ మీడియా మాధ్యమంగా తమ ఆవేదనను వ్యక్తం చేయడంతో వెంటనే స్పందించిన విదేశాంగ శాఖ రంగంలోకి దిగింది. వీరి ఆచూకీపై లావోస్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది. భారతీయులను ఉద్యోగం పేరుతో మోసం చేసే ఇలాంటి స్థానిక మోసగాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే వీరిని మోసం చేసిన భారతీయ ఏజెంట్లపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.
ఎట్టకేలకు 13మందిని భారత్ కు తీసుకురావడంపై ఆయా కుటుంబాల్లో సంతోషం వ్యక్తం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం, విదేశాంగ శాఖ తీసుకున్న చర్యలపై ఆయా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.