నా తెలంగాణ, మెదక్: జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం ఆయన అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అత్యధిక వర్షపాతం నమోదు అవుతుందని ప్రజలు ప్రయాణాలు మానుకోవాలని సూచించారు. పొంగే వాగులు, రహదారులు దాటే ప్రయత్నం చేయొద్దని సూచించారు. శిథిలావస్థలో నివాసం ఉంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని తెలిపారు. జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని సూచించారు.
అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నారని క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
జిల్లాలో 396 చెరువులు పూర్తిగా నీటితో నిండిపోయాయన్నారు. నిండిన చెరువుల వద్ద ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
స్ట్రీమ్స్ కెనాల్స్, కాస్ వే, బ్రిడ్జిలు, రోడ్లు, కల్వర్టుల వద్ద నీరు ఉప్పొంగుతున్నప్పుడు స్థానికంగా ఉన్న అధికారులు వాగులు, వంకలను ప్రజలు దాటకుండా నిరోధించాలన్నారు.
వర్షాలు కారణంగా పురాతన ఇండ్లు కూలిపోయే అవకాశం ఉన్న వాటిని ముందే గుర్తించి అక్కడ నివాసం ఉండే ప్రజలను అప్రమత్తం చేస్తూ దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ భవనాలలో పునరావాసం కల్పించాలన్నారు. తాగునీటి సరఫరా, విద్యుత్ స్తంభాలతో అప్రమత్తం, పాఠశాలలకు సెలవులను ప్రకటించాలని విద్యాశాఖాధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో అత్యవసరమైతే కలెక్టరేట్ లోని 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ నెం. 9391942254లో సంప్రదించాలన్నారు. ఈ సమావేశంలో అన్ని మండలాల అధికారులు, తహాశీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.