కాంగ్రెస్ ‘హైడ్రా’మా
Congress is 'Hydra'ma
- అన్యాక్రాంతమైన భూములపై శ్వేత పత్రం విడుదల చేయాలి
- రైతు ఋణమాఫీ సగం మందికే
- బీజేపీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి
నా తెలంగాణ, సంగారెడ్డి: హైడ్రా పేరుతో కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో హైడ్రామా ఆడుతోందని బీజేపీ నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. సంగారెడ్డిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, జిల్లాస్థాయి వర్క్ షాప్ నకు ఆదివారం మహేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరుతో హైడ్రామాలాడుతోందని విమర్శించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులపై కూడా కబ్జాల ఆరోపణలు ఉన్నాయని వాటిపై కూడా హైడ్రా కూల్చివేతలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో అనుమతులు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే దమ్ముందా అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలపైగా గడుస్తున్నా ఇచ్చిన హామీలను మరిచారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ఆరు లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయ్యాయని కొన్ని లక్షల ఎకరాలు దేవాలయాలకు సంబంధించిన భూములు కబ్జాలకు గురయ్యాయని అన్నారు. పారదర్శకంగా హైడ్రా వాటిపై చర్యలు తీసుకుంటుందా అని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో ఎన్ని చెరువులు, ఎన్ని ప్రభుత్వ స్థలాలు, ఎన్ని ఆలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయో వాటిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సమయంలో రైతు ఋణమాఫీ రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి మూడు దశల్లో ఋణమాఫీ చేసినా పూర్తిస్థాయిలో చేయకుండా సగం మందికే చేయడం ఏంటని నిలదీశారు. రైతు ఋణమాఫీ అందరికీ చేయకపోయినా అందరికీ చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రైతులందరికీ ఋణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ రాష్ర్టంలో ఎనిమిది స్థానాలను గెలుపొంది ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిందని ప్రజల పక్షాన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడతామన్నారు.
సంగారెడ్డిలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్థానిక సంస్థల్లో అధిక సీట్లు సాధించేలా కార్యకర్తలు నాయకులు కృషి చేయాలని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి దిశా నిర్దేశం చేస్తూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, నాయకులు అంజిరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ద్వారక రవి, సంగారెడ్డి మండల అధ్యక్షుడు పాపయ్య తదితరులు పాల్గొన్నారు.