రాహుల్ వయస్సు.. అన్ని సీట్లు కూడా రావు
రత్నభాండార్ తాళాలేమయ్యాయి దర్యాప్తు నివేదిక ఎందుకు బయటపడనీయడం లేదు బార్ ఘర్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ ప్రసంగం
భువనేశ్వర్: రాహుల్ గాంధీ వయస్సు ఉన్నన్ని సీట్లు కూడా కాంగ్రెస్ కు రావని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒడిశాలోని బార్ ఘర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో శనివారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ఓ వైపు కాంగ్రెస్ ను విమర్శిస్తూనే ప్రధాని మోదీ ఒడిశా ప్రభుత్వానికి కూడా చురకలంటించారు. ఒడిశాలోని జగన్నాథ ఆలయానికి సంబంధించిన రత్న భాండార్ తాళాలు గత ఆరేళ్లుగా కనిపించడం లేదన్నారు. తాళాలు ఏమైపోయాయో ఈ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఈ భాండాగారంలో అపారమైన సంపద దాగి ఉందని మోదీ తెలిపారు. దర్యాప్తు నివేదిక బయటపెట్టేందుకు ప్రభుత్వం ఎందుకు ఒప్పుకోవడం లేదని, ఎవరి ప్రయోజనాల కోసమో ఈ విషయం బయటకు పొక్కకుండా చూస్తోందని మోదీ ఆరోపించారు. ఒడిశాను బీదరికం నుంచి బయటికి తీసుకురాలేకపోయారన్నారు. ప్రజల్లో బీజేడీపై తీవ్ర ఆగ్రహావేశాలున్నాయని తెలిపారు.
బార్‌గఢ్ నుంచి ప్రదీప్ పురోహిత్, సంబల్‌పూర్ నుంచి ధర్మేంద్ర ప్రధాన్‌లను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. మీ ఆశీస్సులతో 400పై చిలుకు స్థానాలను సాధిస్తామని తెలిపారు.
ఒడిశా గడ్డపై పుట్టిన ప్రజలకు మరోమారు సువర్ణావకాశం వచ్చిందన్నారు. ఓటు అనే శక్తి ద్వారా ఒడిశాకు మేలు చేసే అవకాశం వచ్చిందని బీజేపీని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రైతులకు కేంద్రం కల్పిస్తున్న కిసాన్ సమ్మాన్ నిధిలో కూడా స్థానిక ప్రభుత్వం గోల్ మాల్ చేస్తుందన్నారు. వరికి మద్దతు ధర రూ. 3100 అందిస్తామని రైతులకు హామీ ఇచ్చారు.