సర్జికల్ స్ట్రైక్స్ చేసే దమ్ము కాంగ్రెస్ కు లేదు
మీరు ఉగ్రవాదులను కాపాడితే.. మేము ఏరిపారేశాం: అమిత్ షా
- పీవోకే భారత్ అధీనంలోనే ఉన్నది.. అది మన సొంతం
- మజ్లిస్ ను తరిమే శక్తి బీఆర్ఎస్,- కాంగ్రెస్ లకు లేదు.. బీజేపీతోనే సాధ్యం
- రిజర్వేషన్లపై రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- ఆర్ఆర్ ట్యాక్స్ తో తెలంగాణ ప్రజల డబ్బు ఢిల్లీకి వెళ్తోంది
- వికారాబాద్, వనపర్తి జనసభల్లో కేంద్ర హోం మంత్రి కామెంట్స్
నా తెలంగాణ, వికారాబాద్/వనపర్తి:
సర్జికల్ స్ట్రైక్స్ గురించి సీఎం రేవంత్ రెడ్డి తమాషాగా మాట్లాడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శించారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసే ధైర్యం కాంగ్రెస్‌కు లేదన్నారు. వికారాబాద్, వనపర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన మాట్లాడారు. సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా పాక్‌లో ఉగ్రవాదులను ఏరిపారేసినట్లు తెలిపారు. బీజేపీ ఉన్నంతవరకు పీవోకే పాక్ వశం కాదని చెప్పారు. కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనన్నారు. ఉగ్రవాదులను కాంగ్రెస్ పార్టీ కాపాడుతూ వచ్చిందని అమిత్‌షా ఆరోపించారు. ‘‘దేశంలో ఉగ్రవాదాన్ని పారదోలడానికి మోదీ కృషి చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో రామ మందిరం నిర్మించారు. అయోధ్యలో రామ మందిరం అంశాన్ని 70 ఏళ్లుగా కాంగ్రెస్ నాన్చుతూ వచ్చింది. ఆలయ ప్రాణ ప్రతిష్ఠలో కూడా ఆ పార్టీ నేతలు పాల్గొనలేదు. తెలంగాణ అభివృద్ధికి హస్తం పార్టీ ఏనాడూ కృషి చేయలేదు. ఆ పార్టీతో పాటు మజ్లిస్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టే శక్తి కేవలం బీజేపీకే ఉంది’’ అని అమిత్‌షా అన్నారు.
రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం..
రిజర్వేషన్లపై రేవంత్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని,- అబద్ధాల ఆధారంగా ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ చూస్తోందని అమిత్ షా మండిపడ్డారు.-‘‘ తెలంగాణలో నేను మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేశారు.- నా తప్పుడు వీడియోలను సర్క్యులేట్ చేశారు.- ‘‘రేవంత్ జీ.. మీరు చేయరాని పని చేశారు.- పోలీసులు దర్యాపు చేస్తున్నారు. అందుకే ఆయన భయపడుతున్నారు. మోదీకి 400 సీట్లు ఇస్తే, రిజర్వేషన్లు రద్దవుతాయని రేవంత్ అబద్ధాలు చెబుతున్నారు. మైనారిటీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింల రిజర్వేషన్లు ఇచ్చారు. మీరు ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తారా?- బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే.. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. తెంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తోంది.- తెలంగాణ ప్రజల డబ్బు ఢిల్లీకి వెళ్తోంది”అని అమిత్ షా అన్నారు.