పూంచ్ ఉగ్రదాడిపై మాజీ సీఎం చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు
ఇరుదేశాలు మాట్లాడుకోవాలన్న ఫరూక్ అబ్దుల్లా
నా తెలంగాణ, న్యూఢిల్లీ: పూంచ్ లో ఉగ్రదాడిపై మాజీ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కూడా దాడిపై పలు ప్రశ్నలు సంధించారు. చరణ్ జిత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రతీసారి ఎన్నికలు వచ్చినప్పుడు ఉగ్రదాడులు ఒక స్టంట్ లా మారతాయన్నారు. దీంతో బీజేపీ ఓట్ల లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్‌లో శనివారం వైమానిక దళం కాన్వాయ్‌పై దాడి జరగడంతో ప్రతిపక్షాలు దూకుడుగా ఉన్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్ పై దాడి ఘటనపై కాంగ్రెస్ నేత, పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భారత వైమానిక దళం (IAF) కాన్వాయ్‌పై ఉగ్రవాదుల దాడి బిజెపి ఎన్నికల ముందు చేసిన స్టంట్ అని ఆయన ఆదివారం నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఫరూక్ అబ్దుల్లా కూడా మన సైనికులు ప్రతిరోజూ అమరులవుతుంటారు కానీ మౌనంగా ఉన్నారని అన్నారు. ఎన్నికల అవకాశాలను బలోపేతం చేసేందుకే ముందస్తు ప్రణాళికతో ఇటువంటి దాడులు జరిగాయని ఆరోపించారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి దాడులు జరిగాయని ఆరోపించారు.
కాగా ఇదే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ దాడి చాలా విచారకరం అన్నారు. గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతిచెందిన సైనికుడికి సంతాపం, సానుభూతిని వ్యక్తం చేశారు. కాశ్మీర్ విషయంలో ఇరుదేశాలు కూర్చొని మాట్లాడుకోవాలన్నారు. ఇరుదేశాల వద్ద కూడా అణుబాంబులు ఉన్నాయని తెలిపారు. ఒకవేళ ఇరుదేశాలు దాడులకు పాల్పడితే ఆ ప్రభావం యావత్ దేశాలపై ఉంటుందన్నది గుర్తెరగాలని తెలిపారు.
ఆర్టికల్ 370 రద్దు తరువాత కూడా ఉగ్రవాదం ఉందని అన్నారు. భారత సైనికులు అమరులు కావడం విచారకరమని ఫరూక్ తెలిపారు.