నీచ రాజకీయానికి కాంగ్రెస్ తెర
మభ్యపెట్టి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు
మరాఠీ భాషకు ప్రత్యేక గౌరవం
10 మెడికల్ కాలేజీల ప్రారంభం
నాగ్ పూర్, షిర్డీ ఏయిర్ పోర్ట్ శంకుస్థాపనలు
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ముస్లింల విషయానికి వస్తే ఒకే జాతిని ఉచ్ఛరిస్తూ, హిందువుల విషయానికి వస్తే అనేక జాతుల పేర్లు ఉచ్ఛరిస్తూ హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలకు తెరలేపిందని, ఇదే కాంగ్రెస్ పార్టీ నీచ ఓటు బ్యాంకు రాజకీయ ఫార్మూలా అని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. దళిత రిజర్వేషన్లను అడ్డుకునేందుకు, రైతులను, యువతను మభ్యపెట్టేందుకు హరియాణాలో ప్రయత్నించి ఘోర ఓటమిని చవి చూసిందన్నారు. అందుకే మహాత్మాగాంధీ స్వాతంత్ర్యం అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు మనుగడ సాగించలేదని స్వయంగా చెప్పారని అన్నారు. ముస్లింలను, హిందువులను భయపెడుతూ వారి ఓటు బ్యాంకు కోసం దేశ విచ్ఛిన్న దిశగా ప్రచారాలకు తెరలేపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ర్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు. మరాఠీ భాషకు ప్రత్యేక గౌరవం ఇచ్చుకున్నామన్నారు. ఇదంతా ఛత్రపతి, అంబేడ్కర్, సావిత్రిభాయి ఫూలే, ఫూలే వంటి మహానీయుల ఆశీర్వాదం వల్ల, మీ నమ్మకం, విశ్వాసం వల్లే జరిగిందని ప్రధాని మోదీ తెలిపారు.
మహారాష్ర్టలోని బుధవారం ఉదయం రూ. 7,600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్ మాధ్యమంగా శంకుస్థాపన చేశారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. నాగ్ పూర్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం అప్‌గ్రేడేషన్‌కు రూ.7వేల కోట్లతో చేపట్టారు. షిర్డీ విమానాశ్రయంలో రూ. 645 కోట్ల విలువైన కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మిల్ భవనాన్ని ప్రారంభించారు.
యువతకు శిక్షణ కోసం ఐఐఎస్ స్కిల్ సెంటర్ ప్రారంభం..
10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రధాని ప్రారంభించారు. కళాశాలల ఏర్పాటులో ఆరువేల సీట్లు పెరగనున్నాయి.
ఐఐఎస్ (ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్), టాటా ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటైన మోడల్ ప్రాజెక్ట్ ను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద నిరుద్యోగ యువతకు ఏటా ఐదువేలమందికి పలు రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అనంతరం ఉద్యోగ, ఉపాధి కల్పించనున్నారు. మెకాట్రానిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ వంటి అత్యంత ప్రత్యేక రంగాలలో శిక్షణను అందించనున్నారు.
వీఎస్ కే బోధనతో ఉన్నత విద్య..
మహారాష్ట్ర విద్యా సమీక్షా కేంద్రాన్ని (వీఎస్ కే) ప్రధాని ప్రారంభించారు. ఈ అకాడమీ ద్వారా నూతన విద్యావిధానాన్ని విద్యార్థులకు బోధించనున్నారు. బోధనా పద్ధతులను సులభతరం చేస్తూ ఉన్నత విద్యను కూడా స్థానిక (మరాఠీ) భాషలోనే కొనసాగించనున్నారు.