లంచం ఆరోపణలు అవాస్తవం
స్టాక్ ఎక్స్చేంజ్ కి అదానీ గ్రూప్ సమాచారం
సాక్ష్యాలే లేకుండా ఆరోపణలా?: మహేశ్ జెఠ్మలానీ
పత్రాల్లో వారి పేర్లే లేవు: ముకుల్ రోహిత్గీ
ముంబాయి: అదానీ గ్రూప్ పై అమెరికా విదేశీ అవినీతి చట్టం కింద లంచం ఆరోపణలు లేవని అదానీ గ్రూప్, అదానీ గ్రీన్ ఎనర్జీ స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం సంస్థకు చెందిన గౌతమ్ అదానీ, సార్ అదానీ, వినీత్ జైన్ లపై ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ సమాచారాన్ని ఇచ్చింది. అదానీ గ్రూప్ అధికారులపై అవినీతి ఆరోపణలపై వివిధ మీడియా గ్రూపులు ప్రచురించిన నివేదికలు కూడా అవాస్తవమని ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో పేర్కొంది. ప్రకటన తరువాత అదానీ షెర్లలో భారీ పెరుగుదల నమోదవుతుంది.
మహేశ్ జెఠ్మలానీ..
అదానీ గ్రూప్ పై కాంగ్రెస్ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాలు లేవని అవన్నీ నిరాధారాలేనని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ అన్నారు. బుధవారం ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు చూడకుండా గందరగోళం సృష్టించడంతో అనేకమంది పెట్టుబడిదారులు నష్టపోయారని అన్నారు. పార్లమెంట్ లో జేపీసీ కోసం కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్ కూడా తప్పేనని తాను స్పష్టం చేయాలని అనుకుంటున్నానన్నారు. సాక్ష్యాలు, కాంగ్రెస్ విధానం చూస్తుంటే సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా కేవలం బీజేపీపై కక్ష్యసాధింపు చర్యలకు దిగుతుందని స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఏ విధంగానైనా అదానీ సంస్థ షేర్లకు నష్టం వాటిల్లే ఉద్దేశ్యం దీని వెనుక దాగి ఉందని జెఠ్మలానీ ఆరోపించారు.
ముకుల్ రోహిత్గీ (మాజీ అటార్నీ జనరల్)..
అదానీ గ్రూప్ పై వచ్చి ఆరోపణల్లో పత్రాలను (అమెరికా న్యాయశాఖ డీఓజే) గమనిస్తే ఎలాంటి లంచం, న్యాయానికి ఆటంకం కలిగించినట్లు ఆరోపణలు లేవని భారత మాజీ అటార్నీ జనరల్, ప్రముఖ న్యాయవాది ముకుల్ రోహిత్గీ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
తాను ఎవ్వరికీ ప్రతినిధిని కాదని, కానీ తాను పత్రాలను పరిశీలించి మీదట తన వ్యక్తిగత అభిప్రాయాలు తెలియజేస్తున్నానని తెలిపారు. యూఎస్ అభియోగాల్లో అదానీ గ్రూప్ అధికారుల పేర్లే లేవన్నారు. అజూర్ పవర్‌కు చెందిన కొందరు అధికారులు, విదేశీ పెట్టుబడిదారుడితో సహా మరికొందరిపై మాత్రమే అభియోగాలు ఉన్నాయని గమనించినట్లు తెలిపారు. ఈ పత్రాల్లో ఏ అంశం స్పష్టంగా లేదన్నారు. ఎవరు లంచం ఇచ్చారు? ఎవరికి ఇచ్చారు? ఎంత ఇచ్చారు? ఎక్కడ ఇచ్చారు? ఏ రూపంలో ఇచ్చారు? లంచం ఎవరు అందుకున్నారు? అనే విషయాలపై స్పష్టత లేదని ముకుల్ రోహిత్గీ అన్నారు.