అర్జీలపై సత్వర చర్యలు

కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశాలు

Sep 30, 2024 - 19:46
 0
అర్జీలపై సత్వర చర్యలు
నా తెలంగాణ, నిర్మల్: ప్రజల అర్జీలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, రెండు పడక గదుల ఇళ్ళ వంటి సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు. ప్రజావాణి కార్యక్రమం అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి దరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, వివరాలను కరిమార్కుల విభాగంలో పొందుపరచాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారానికి సంబంధించిన వివరాలను అందించాలన్నారు. అక్టోబర్​ 2 గాంధీ జయంతి రోజు స్వచ్ఛతా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 
 
అదనపు కలెక్టర్ అభినందనలు..

టూరిజం శాఖ ఉత్తమ హస్తకళల గ్రామంగా నిర్మల్ ఎన్నికైన సందర్భంగా అదనపు కలెక్టర్​ ఫైజాన్​ అహ్మద్​ ను కలెక్టర్​ అభిలాష అభినవ్​ అభినందించారు. అవార్డు సాధనకు ఆయన విశేష సేవలందించారని కొనియాడారు. 
అదనపు కలెక్టర్​ ఫైజాన్​ అహ్మద్​ మాట్లాడుతూ.. నిర్మల్​ జిల్లా బెస్ట్ టూరిజం విలేజ్ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపారు. అవార్డును సాధించేలా ప్రోత్సహించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ కు ధన్యవాదాలు తెలిపారు. 
 
బతుకమ్మ ఆడిన కలెక్టర్..

నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మహిళా ఉద్యోగులు ఇతర మహిళలతో కలిసి సాయంత్రం కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ ఆడారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బతుకమ్మ సంబరాల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఆర్డిఓ విజయలక్ష్మి, మహిళా అధికారులు, స్వయం శక్తి సంఘాల మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా మహిళలందరికీ కలెక్టర్ ముందస్తుగా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
 
పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలు..

దసరా సందర్భంగా నిర్మల్ పట్టణంతో పాటు వివిధ పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ వేడుకలను సోమవారం నిర్వహించారు. బుధవారం నుంచి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వేడుకలు జరిపారు. ఇందులో భాగంగా స్థానిక జెవిఎన్ ఆర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయినులు బతుకమ్మలు పేర్చి కోలాటాలు ఆడారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మణికుమారి పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు. పండుగలు ఐక్యతా భావాన్ని చాటుతాయన్నారు.