ప్రసాదం కల్తీపై చర్యలు తీసుకోవాలి

వీహెచ్ పీ ఆధ్వర్యంలో ధర్నా

Sep 30, 2024 - 20:07
 0
ప్రసాదం కల్తీపై చర్యలు తీసుకోవాలి

నా తెలంగాణ, నిర్మల్: హిందువులు పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి ప్రసాదం కల్తీ అంశంలో విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. సోమవారం నిర్మల్ జిల్లా వీహెచ్​ పీ శాఖ ఆధ్వర్యంలో కల్తీ ఉదంతంపై స్థానిక ఆర్డీవో  కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి పలువురు వక్తలు మాట్లాడుతూ హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తూ కల్తీకి పాల్పడిన వారిని గుర్తించేందుకు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను వెంటనే విధులను నుంచి తొలగించాలని తెలిపారు. దేవాదాయ శాఖను రద్దుచేసి అన్యాక్రాంతం అయిన దేవాలయ భూములను గుర్తించి తిరిగి దేవాలయానికి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్వామీజీలు ధార్మిక పెద్దల ఆధ్వర్యంలో ధార్మిక పరిషత్ ను ఏర్పాటు చేసి వారికి దేవాలయాల నిర్వహణను అప్పగించాలని అన్నారు. దేవాలయ పరిసరాల్లో నిర్వహిస్తున్న వాణిజ్య సముదాయాలను కేవలం హిందువులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిషత్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జాదవ్ విఠల్,  మూర్తి ప్రభాకర్, సాదం ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.