నా తెలంగాణ, నిర్మల్: ఇటీవలే తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బెల్తరోడాకు చెందిన దుర్గకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హామీ ఇచ్చారు. శుక్రవారం దుర్గను జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల పాఠశాలలో పెద్దమ్మ అనిత, గ్రామస్తుల సమక్షంలో 6వ తరగతిలో ప్రవేశం కల్పించారు. దుర్గ చదువుకు అవసరమైన బ్యాగులు, కాస్మోటిక్స్, దుస్తులు, నోటు పుస్తకాలను అందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దుర్గ ఉన్నత చదువులు చదివేలా ప్రభుత్వం తరఫున అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. చిన్నారికి అన్ని వసతులు కల్పించాలని, ఎలాంటి సమస్యలున్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానంలో నిలవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల తరగతి గదులు, వసతి గృహాలు, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్ ను కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రతి రోజు విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, అల్పాహారం అందించాలని ఆదేశించారు.
నాణ్యమైన వస్తువులు, కూరగాయలను మాత్రమే వంటకు వినియోగించాలన్నారు. విద్యార్థులకు ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధిచేయబడ్డ తాగునీటిని అందించాలని, ప్రతిరోజు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో డీఈవో రవీందర్ రెడ్డి, తానూర్ ఎంపీడీవో అబ్దుల్ సమద్, తహసీల్దార్ లింగమూర్తి, పట్టణ తహసిల్దార్ రాజు, జిల్లా బాలల పరిరక్షణ అధికారి దేవి మురళీ, సగ్గం రాజు, శ్రీదేవి, ప్రిన్సిపాల్ గీత, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.