MODI: రేపు తెలంగాణకు ప్రధాని

Prime Minister Narendra Modi will visit Telangana tomorrow

Mar 14, 2024 - 15:52
 0
MODI: రేపు తెలంగాణకు ప్రధాని
  •  పది రోజుల్లో రాష్ట్రానికి రెండోసారి రాక

  •  మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా పర్యటన

  •  ఇప్పటికే రూ.82 వేల కోట్ల పనులకు శ్రీకారం

  •  మరిన్ని ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని

  •  మల్కాజిగిరిలో రోడ్​ షో.. నాగర్​ కర్నూల్​ లో బహిరంగ సభ

  •  ఏర్పాట్లు పూర్తి చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం

  •  మోదీ సమక్షంలో కమలం పార్టీలో మరిన్ని చేరికలు!


నా తెలంగాణ, హైదరాబాద్​: పది రోజుల వ్యవధిలోనే ప్రధాని నరేంద్ర మోదీ రెండోసారి తెలంగాణకు రాబోతున్నారు. శుక్ర, శని వారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ.. రోడ్​ షోలతోపాటు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఈ మేరకు ప్రధాని షెడ్యూల్​ ఖరారైంది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మోదీ రోడ్​ షో, సభలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 
ఇదీ షెడ్యూల్​
మార్చి 15న సాయంత్రం 4.50 గంటలకు ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు రోడ్​ షోలో పాల్గొంటారు. 6.40 నిమిషాలకు సోమాజీగూడలో రాజ్​ ​భవన్​ కు చేరుకుంటారు. అనంతరం పలువురు ప్రముఖులను అక్కడే కలుసుకుంటారు. రాత్రి రాజ్​ ​భవన్​ ​లోనే బస చేసి..16వ తేదీన ఉదయం 10.45 గంటలకు రాజ్​ ​భవన్​ నుంచి11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11 గంటల 55 నిమిషాలకు నాగర్​ కర్నూల్​ చేరుకొని మధ్యాహ్నం12 గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటిగంటకు నాగర్​ కర్నూల్​ నుంచి గుల్బర్గా పర్యటనకు బయలుదేరుతారు.
మరిన్ని చేరికలు?
ప్రధాని మోదీ పర్యటనతో రాష్ట్రంలో బీజేపీ రోజు రోజుకు పుంజుకుంటున్నది. అటు బీఆర్​ఎస్​, ఇటు కాంగ్రెస్​ పార్టీల నుంచి పలువురు నాయకులు కమలం పార్టీలో చేరుతున్నారు. బీజేపీ అధిష్టానం కూడా ఈసారి తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతున్నది. ఈ మేరకు ఇప్పటికే రెండు జాబితాల్లో 15 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఖమ్మం, వరంగల్​ స్థానాల్లో కూడా బలమైన అభ్యర్థులను పెట్టాలని భావిస్తున్నది. ప్రధాని మోదీ తెలంగాణ రెండు రోజుల పర్యటనలో పలువురు నాయకులు కమలం పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తున్నది.