ఒకే రోజు 30 ప్రోగ్రామ్స్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటన
Union Minister Kishan Reddy participated in more than 30 development programs on the same day
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సుడిగాలి పర్యటన
- నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు.. 20 డివిజన్లు
- ఉదయం 8 నుంచి.. సాయంత్రం 5 వరకు
- ఒకే రోజు రికార్డు స్థాయిలో 30కి పైగా కార్యక్రమాలకు హాజరు
- ఓపెన్ జిమ్ లు, కమ్యూనిటీ హాల్స్ ప్రారంభం
- ప్రజలు తాగునీటి అవసరాలు తీర్చేలా.. వాటర్ లైన్లు, పవర్ బోర్స్ ఏర్పాటు
నా తెలంగాణ, హైదరాబాద్: కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోని నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని దాదాపు 20 డివిజన్లలో అభివృద్ధి పనులను ప్రారంభించారు.
తాగునీటి అవసరాలు తీర్చేలా..
వేసవి సమీపిస్తున్న వేళ ఆయా డివిజన్ల పరిధిలో ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేశారు. తన ఎంపీ ల్యాడ్స్ తోపాటు సీఎస్ఆర్, కేంద్ర ప్రభుత్వ నిధులతో పవర్ బోర్లు, వాటర్ లైన్లు ఏర్పాటు చేశారు. దాదాపు అన్ని డివిజన్లలో సిటిజన్స్ రోజూ వ్యాయామం చేసేందుకు ఓపెన్ జిమ్ లు ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఆయా డివిజన్లలో నిర్మించిన కమ్యూనిటీ హాల్స్ ఓపెన్ చేశారు. ఒకే రోజు దాదాపు 30కి పైగా ప్రోగ్రామ్స్ కు హాజరై ప్రారంభోత్సవాలు చేశారు.
తాగునీటిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి
వేసవి సమీపిస్తున్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని ప్రజల తాగునీటి అవసరాలపై దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఇప్పటికే బెంగళూరులో తాగునీటికి కటకట ఎదురవుతున్న వేళ.. హైదరాబాద్ జంట నగరాల ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైటెక్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని చెబుతూ.. బస్తీ ప్రజల అవసరాలు తీర్చలేదని మండిపడ్డారు. కనీసం రోడ్లు, నీటి వసతి, డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారని, కాంగ్రెస్ సర్కారైనా.. బస్తీవాసుల బాధలు తీర్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం నాలుగు అసెంబ్లీ సెగ్మంట్ల పరిధిలో కోట్లాది రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.
క్రీడాకారులకు అభినందన..
ఖేలో తెలంగాణ.. జీతో తెలంగాణ కార్యక్రమంలో భాగంగా జింఖాన గ్రౌండ్స్ లో కొనసాగుతున్న సికింద్రాబాద్ పార్లమెంట్ మహిళా క్రీడోత్సవాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ లో పాల్గొంటున్న క్రీడాకారులను కిషన్ రెడ్డి అభినందించారు.