కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు
Congress party's blackmail politics in Telangana has come out with former minister Mallareddy
- మొన్న మల్లారెడ్డి అల్లుడి కాలేజీ కూల్చివేసిన రాష్ట్ర సర్కారు
- ఆస్తుల రక్షణకు కప్పం కట్టి.. కాంగ్రెస్ లో చేరాలని మల్లారెడ్డి నిర్ణయం
- కుమారుడు, అల్లుడితో కలిసి బెంగళూరులో డీకే శివకుమార్ తో భేటీ
నా తెలంగాణ, హైదరాబాద్: కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెర లేపింది. బీఆర్ఎస్ నేతల అక్రమాలు, అవినీతిని అడ్డుపెట్టుకొని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నది. ఆర్థికంగా బలమైన నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నది. విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి విషయంలో బెంగళూరు వేదికగా కాంగ్రెస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలు బయటపడ్డాయి.
కూల్చివేతల ఎఫెక్ట్
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రోజుల కిందట కూల్చివేసింది. హైదరాబాద్ శివారు దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్‌లో రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఏరోనాటికల్, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత భవనాలు, 6 తాత్కాలిక షెడ్ల కూల్చివేతలు ప్రారంభించారు. మొత్తం 8.24 ఎకరాల చెరువు (ఎఫ్‌టీఎల్ బఫర్ జోన్) ఆక్రమించి పార్కింగ్ కోసం రోడ్లు, భవనాలు నిర్మించినట్లు నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులు గుర్తించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో కూల్చివేతలు ప్రారంభించారు. కూల్చివేతలు మొదలుకాగానే.. మల్లారెడ్డి కాంగ్రెస్ నేతలకు టచ్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన ఆస్తులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
బెంగళూరు వేదికగా..
గురువారం మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ అయ్యారు. కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలిసింది. కాంగ్రెస్ లో చేరడం కోసం మల్లారెడ్డితో హస్తం పార్టీ ఎంత కప్పం(పార్టీ ఫండ్) కట్టించుకుంటుందనే దానిపై చర్చ మొదలైంది.