మూడోసారి ప్రధాని మోదీ ఖాయం దేశాభివృద్ధికి సంస్కరణలు కొనసాగిస్తాం
ఫిక్కీ సదస్సులో మంత్రి నిర్మలా సీతారామన్
నా తెలంగాణ, న్యూఢిల్లీ: మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారం చేపట్టడం ఖాయమని, దేశాభివృద్ధి కోసం ఆయన చేపడుతున్న సంస్కరణలు కొనసాగుతాయని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నిర్వహించిన ‘డెవలప్ ఇండియా @ 2047’లో ఆమె పాల్గొని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా పరిశ్రమల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. 2047 వరకు ప్రపంచంలోనే ఆర్థికంగా తొలిస్థానంలో భారత్ ఉండాలనే లక్ష్యంతో కేంద్రం ముందుకు వెళుతోందన్నారు. ఏప్రిల్–మేలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ కొనసాగిస్తున్న సంస్కరణలకు మరింత పదునెక్కిస్తారని మంత్రి నిర్మలమ్మ పేర్కొన్నారు.
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమం ద్వారా దేశ వృద్ధి సాధ్యమన్నారు. ఇది లేకుండా ఏ దేశమూ ప్రగతి సాధించలేదని స్పష్టం చేశారు. ఏఐ ఇన్నోవేషన్ రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని నిర్మలమ్మ పేర్కొన్నారు. అంతరిక్ష రంగంలో కూడా భారత్ ప్రపంచంలోనే మంచి స్థానంలో ఉందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో భారత్ ఆర్థిక రంగంలో 10వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. 2014 తరువాత ప్రధాని మోదీ చేపట్టిన కీలక సంస్కరణల వల్ల ఐదో స్థానానికి చేరుకుంటుందని అతి త్వరలో ఈ స్థానం మరింత మెరుగుపడి మూడుకు చేరుకుంటుందన్న విశ్వాసాన్ని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యక్తం చేశారు.