ఆప్ నేతల ఇళ్లపై ఈడీ సోదాలు
మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం దాడులు నిర్వహించింది
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కీలక నేతల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం దాడులు నిర్వహించింది. నీటిబోర్డు అవినీతి కుంభకోణానికి సంబంధించి పదికిపైగా ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ ఇళ్లు, వాటర్ బోర్డు మాజీ సభ్యుడు శలభ్ కుమార్ ఆస్తులపై కూడా దాడులు నిర్వహించింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఎన్డీ గుప్తా నివాసంలో కూడా ఈడీ దాడులు కొనసాగాయి. ఇదిలావుండగా ఢిల్లీ జల్ బోర్డుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన రిటైర్డ్ డీజేబీ చీఫ్ ఇంజనీర్ జగదీష్ అరోరా, కాంట్రాక్టర్ అనిల్ అగర్వాల్‌ల ఈడీ కస్టడీని మరో ఐదు రోజుల పాటు పొడిగించారు. ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతోంది.ఢిల్లీ జల్ బోర్డుకు విద్యుదయస్కాంత ప్రవాహ మీటర్ల సరఫరాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జగదీష్ అరోరా, అనిల్ అగర్వాల్‌లు అరెస్టయ్యారు. ఐదు రోజుల కస్టడీ గడువు ముగియడంతో వారిని కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి రిమాండ్‌ను పొడిగించాలని ఈడీ కోరగా, అందుకు అంగీకరించిన కోర్టు ఇద్దరి రిమాండ్‌ను ఐదు రోజుల పాటు పొడిగించింది.