MODi: తెలంగాణపై  మోదీ ఫోకస్

Prime Minister Modi will visit Telangana for three days from March 16

Mar 11, 2024 - 16:11
 0
MODi: తెలంగాణపై  మోదీ ఫోకస్
  •  ఇప్పటికే రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించిన ప్రధాని
  •  ఈ నెల16 నుంచి మరో మూడు రోజులు తెలంగాణలోనే
  •  జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, మల్కాజిగిరిలో భారీ సభలకు ఏర్పాట్లు
  •  రేపు రాష్ట్రానికి రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా
  •  తెలంగాణలో మెజార్టీ సీట్లు సాధించడమే లక్ష్యంగా కమలం పార్టీ అడుగులు

నా తెలంగాణ, హైదరాబాద్​: భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఇక్కడ మెజార్టీ ఎంపీ సీట్లు సాధించుకోవడమే లక్ష్యంగా ఎన్నికల కార్యాచరణ అమలు చేస్తున్నది. ఇటీవల తెలంగాణలో రెండు రోజులు పర్యటించి బీజేపీ శ్రేణుల్లో జోష్​ నింపిన ప్రధాని మోదీ.. పది రోజులు కూడా తిరగక ముందే మళ్లీ రాష్ట్రానికి రాబోతున్నారు. మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించడమే గాక మూడు బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా రేపు రాష్ట్రానికి రాబోతున్నారు. 
మోదీ మేనియా..
ప్రధానమంత్రి తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. ఇటీవల రాష్ట్రంలో రెండు రోజులపాటు పర్యటించిన మోదీ.. దాదాపు రూ.82 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆదిలాబాద్​, పటాన్​ చెరు రెండు బహిరంగ సభల్లో పాల్గొని తెలంగాణలో బీజేపీని ఆదరిస్తే.. బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీల అవినీతి, చీకటి బంధంపై సర్జికల్​ స్ట్రైక్స్​ చేస్తామని చెప్పారు. ప్రధాని రెండు రోజుల పర్యటన రాష్ట్ర బీజేపీలో ఉత్సాహం నింపింది. అంతకు ముందే బీజేపీ రాష్ట్ర నాయకత్వం నేతృత్వంలో విజయ సంకల్ప యాత్రలు చేపట్టి114 నియోజకవర్గాలు చుట్టేసిన విషయం తెలిసిందే. ప్రధాని ఇటీవలి పర్యటన ముగిసి పది రోజులు కూడా పూర్తికాకముందే.. మళ్లీ మోదీ తెలంగాణకు రాబోతున్నారు. ఈ నెల15 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని.. ఈ నెల16, 18, 19, తేదీల్లో తెలంగాణలో పర్యటిస్తారు. ఈ మేరకు జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, మల్కాజిగిరిలో మోదీ సభలకు రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
రేపు అమిత్​ షా రాక..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈనెల12న తెలంగాణలో పర్యటించనున్నారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా ఆయన రాష్ట్రానికి వస్తున్నారు. ఇంపీరియల్ గార్డెన్​ లో సోషల్ మీడియా వారియర్స్ తో నిర్వహించే సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షులు ఆపై స్థాయి నాయకులతో నిర్వహించే విజయ సంకల్ప సభ సమ్మేళనంలో పాల్గొంటారు. రాష్ట్రంలో ఆయా నియోజకవర్గాల్లో ప్రకటించాల్సిన అభ్యర్థుల పేర్లు, ఆయా స్థానాల్లో పార్టీ బలాబలాలపై అమిత్​ షా సమీక్ష నిర్వహించనున్నారు. అయితే బీఆర్​ఎస్​ సిట్టింగ్​ ఎంపీలు సహా ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు బీజేపీలో చేరుతుండటంతో పార్టీ పుంజుకుంటున్నది.