మోదీ హయాంలో అవినీతి రహిత పాలన: కిషన్​ రెడ్డి

Union Minister Kishan Reddy said that not a single rupee has been corrupted during Modi's rule

Apr 4, 2024 - 15:41
 0
మోదీ హయాంలో అవినీతి రహిత పాలన: కిషన్​ రెడ్డి
  •  దేశాభివృద్ధి కోసం ఓటు వేయండి

  •  ఎన్డీయే 400 స్థానాలు గెలుచుకుంటుంది

  •  అందరూ పోలింగ్​ లో పాల్గొనాలి

  •  మోదీకి ముందు మోదీ తర్వాత మార్పు చూడండి

  •  బస్తీ పర్యటనలో కేంద్ర మంత్రి కామెంట్స్​

నా తెలంగాణ, హైదరాబాద్​: మోదీ హయాంలో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదని, ఇలాంటి నీతిమంతమైన పాలన కోసం మరోసారి బీజేపీని గెలిపించాలని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ జి. కిషన్​ రెడ్డి పిలుపునిచ్చారు. దేశమంతా మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నదని, ఈసారి ఎన్డీయే 400 స్థానాలు గెలుచుకుంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కిషన్​ రెడ్డి అంబర్​ పేట నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్​ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘హైదరాబాద్ నగరంలో ఎప్పుడు 40 శాతానికి మించి ఓటింగ్ శాతం ఉండదు. దానిపై మనం దృష్టి సారించాలి. ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి. అందరూ పోలింగ్​ లో పాల్గొనాలి. ఈసారి దేశం, భవిష్యత్తు కోసం ఓటు వేయాలి. దేశాభివృద్ధి కోసం ఓటు వేయాలి. 2014కు ముందు 50 ఏండ్లు దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించింది. మోదీకి ముందు మోదీ తర్వాత దేశంలో ఎలాంటి మార్పులు వచ్చాయో ఒక్కసారి ఆలోచించండి. అవినీతి రహిత పరిపాలన అందించిన మోదీ ప్రభుత్వం.. అనేక సంస్కరణలు చేపట్టింది”అని కిషన్​ రెడ్డి గుర్తు చేశారు.
కర్ఫ్యూలు లేవు..
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మత కలహాలు, కర్ఫ్యూలు లేని పాలన అందించారని, ఉగ్రవాదాన్ని పెకిలించి, బాంబు పేలుళ్లకు అడ్డుకట్ట వేశారని కిషన్​ రెడ్డి తెలిపారు. ‘‘బీజేపీ ప్రభుత్వం అంతర్గత భద్రత, దేశ రక్షణ విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రజలు ఆలోచించాలి.  దేశ అస్థిత్వాన్ని కాపాడటంలో మోదీ తీసుకుంటున్న చొరవ అద్భుతం. మహిళలకు 33 శాతం రిజర్వేషన్, త్రిపుల్ తలాక్​ చట్టం రద్దు లాంటి సంస్కరణలు తెచ్చారు. ప్రపంచాన్ని వణికించిన కరోనాను కట్టడిచేసి ప్రపంచానికి వ్యాక్సినేషన్ అందించిన ఘనత మోదీ ప్రభుత్వనిదే. 50 ఏండ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లలో 12 లక్షల కోట్ల అవినీతి చేసిందని సుప్రీంకోర్టు చెప్పింది. కాగ్ రిపోర్ట్ ఇచ్చినటువంటి పరిస్థితి మన కళ్లముందు కనిపిస్తుంది. ఓటు వేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. గతంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు మన హైదరాబాద్ నగరంలో ఏ విధంగా బలపడ్డాయో, ఎలా బాంబులు పేల్చాయో గుర్తు చేసుకొని ఓటు వేయండి”అని పిలుపునిచ్చారు. 
దేశం కోసం మోదీ
నిస్వార్థంగా సమాజం, దేశం కోసం సేవ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని, సికింద్రాబాద్​ ఎంపీగా తనను ఆశీర్వదించాలని కిషన్​ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘‘2014లో 270, 2019లో 303 స్థానాలకు బీజేపీ పెరిగింది. 2024లో 370, ఎన్డీయే భాగస్వామ్యంతో 400 పై చిలుకు స్థానాలను సాధించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ప్రపంచదేశాల్లో భారతదేశ కీర్తి, గౌరవాలు ఎలా పెరిగాయో మీకు తెలుసు. ప్రపంచ వేదికపై గతంలో భారత ప్రధాని ఎక్కడో లాస్ట్​ లో కనిపించేవారు. కానీ ప్రస్తుతం ఫ్రంట్​ లో ప్రధాని నరేంద్ర మోదీ లేకుండా సమావేశం లేని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని 48 గంటలపాటు ఆపించి మనదేశ విద్యార్థులను 25 వేల మందిని వెనక్కి తీసుకువచ్చారు. టర్కీ, ఇజ్రాయెల్​ పలు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను కూడా వెనక్కి తీసుకురాగలిగామ’’ని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి స్పష్టం చేశారు.