తెలంగాణ అభివృద్ధికి మోదీ సర్కారు కృషి: కిషన్ రెడ్డి
Union Minister G. Kishan Reddy participated in the inauguration of Vande Bharat train
- సికింద్రాబాద్ – విశాఖ వందే భారత్ ప్రారంభించిన ప్రధాని
- కార్యక్రమంలో పాల్గొని పచ్చజెండా ఊపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
నా తెలంగాణ, హైదరాబాద్: గత పదేళ్లలో దేశంలో రైల్వే గణనీయమైన అభివృద్ధి సాధించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లను ప్రవేశపెట్టారని కొనియాడారు. అహ్మదాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ –- విశాఖ మార్గంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. మంగళవారం నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు మార్గంలో కొత్త ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ పచ్చజెండా ఊపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కిషన్ రెడ్డి, వర్చువల్‌గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఇప్పటికే మూడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు నడుస్తున్నాయని.. ఇవాళ మరో ఎక్స్‌ప్రెస్‌ను మోదీ ప్రారంభించడం సంతోషకరమన్నారు.
త్వరలో చర్లపల్లి..
చర్లపల్లి టెర్మినల్ పనులు 90 శాతం పూర్తయ్యాయని.. మరికొద్ది రోజుల్లోనే ప్రారంభిస్తామని చెప్పారు. ‘‘భారతీయ రైల్వేలో మెరుగైన సౌకర్యాలు కల్పించడం.. రైల్వే వేగాన్ని పెంచాలని ఉద్దేశంతో డబుల్ లైన్స్ ను మోదీ ప్రభుత్వం ట్రిపుల్ లైన్స్‌గా మార్చుతున్నది. రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కార్యక్రమం కూడా జరుగుతున్నది. దేశీయ టెక్నాలజీతో అంతర్జాతీయ ప్రమాణాలతో వందే భారత్, అమృత్ భారత్ రైళ్లను ప్రారంభిస్తున్నది. దక్షిణమధ్య రైల్వే పరిధిలో 9 పీఎం గతి శక్తి కార్గో టెర్మినళ్లు,11 గూడ్స్ షెడ్లు, రెండు జన ఔషధి కేంద్రాలు, 3 రైల్వే కోచ్ రెస్టారెంట్లను కూడా మోదీ ప్రారంభించారు. రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ను, రూ.500 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ ను అభివృద్ధి చేస్తున్నాం. కొమరవెళ్లి రైల్వే స్టెషన్ కూడా ప్రారంభించుకున్నాం. తాజాగా నూతన ఎంఎంటీఎస్ సేవలు మొదలయ్యాయి”అని కిషన్ రెడ్డి తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా మొత్తం10 వందేభారత్‌లను ప్రధాని మంగళవానం వర్చువల్‌గా ప్రారంభించారు. దీంతో దేశంలో మొత్తం ఈ రైళ్ల సంఖ్య 50 దాటడం విశేషం.
అభివృద్ధి పనుల ప్రారంభం
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి సనత్ నగర్ అసెంబ్లీ బన్సీలాల్ పేట డివిజన్ బండ మైసమ్మ నగర్, చాచా నెహ్రు నగర్, సీసీ నగర్ లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బన్సీలాల్ పేట డివిజన్ ఐడీహెచ్ కాలనీకి చెందిన స్థానిక నాయకులను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంబర్ పేట్ నియోజకవర్గం నల్లకుంట, గోల్నాక, కాచిగూడ, బర్కత్ పురా చెప్పల్ బజార్ డివిజన్ లలో ఓపెన్ ఎయిర్ జిమ్ లను కేంద్ర మంత్రి ప్రారంభించారు.