ఉగ్రపంథాకు చెక్ మరోమారు సర్జికల్ స్ట్రైక్ దాడులకు సిద్ధం
Prepare for another surgical strike to check terrorism
- పీర్ పంజాల్, అటవీలో భారీ బంకర్లు
- అందులోనే ఆయుధ డంప్
- దాడుల తర్వాత బంకర్లలోనే షెల్టర్
- పాక్, చైనాల పూర్తి సహాయం
- భారీ ఆపరేషన్ కు భారత్ సిద్ధం
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: జమ్మూకశ్మీర్ లో ఉగ్రదాడులు పెరిగాయి. స్థానిక గైడ్ ల సహాయంతో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై దాడులను పెంచుతున్నారు. అదే సమయంలో ఉగ్రవేటను పటిష్ఠంగా నిర్వహిస్తున్న భారత బలగాలకు చిక్కకుండా పారిపోతున్నారు. దీని వెనుక ఉన్న అసలు కారణాలను భారత ఇంటలిజెన్స్ వర్గాలు పూర్తిగా పసిగట్టి కేంద్ర, ఆర్మీ వర్గాలకు సమాచారం అందించాయి. ప్రస్తుతం దీనికి విరుగుడు ఆపరేషన్ ను కూడా కనుగొన్నట్లు సమాచారం.
జమ్మూ నుంచి కాశ్మీర్ కు మకాం మార్చుకున్న ఉగ్రవాదులు ఇక్కడ దాడులకు తెగబడుతూ సవాల్ విసురుతున్నారు. వీరికి పాక్,చైనా సహాయ సహకారాలు అందుతున్నాయి. అదే సమయంలో పీర్ పంజాల్ పర్వత పంక్తులపై పలు లోతైన బంకర్లను నియమించుకొని అక్కడే ఆయుధాలను కూడా డంప్ చేశారు. ఆ ప్రాంతం నుంచి భారత్ లోకి సొరంగాల ద్వారా అటవీ ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రస్తుతం పీర్ పంజాల్ పర్వతం, అటవీ ప్రాంతంపై పూర్తిగా దృష్టిపెడితే ఉగ్రవాదుల ఆట కట్టించవచ్చని ఇంటలిజెన్స్ గుర్తించింది.
ఉగ్రవాదులు దాడులకు పాల్పడి పారిపోతూ సురక్షితమైన బంకర్లను కూడా గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ బంకర్లలో దాదాపు 57 నుంచి 59 మంది ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతూ దాడులకు తెగబడుతున్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. వీరిని మట్టుబెట్టేందుకు పూర్తిస్థాయిలో భారత భద్రతా బలగాలు అత్యాధునిక పరికరాలతో కూంబింగ్ నిర్వహించాలని, పీర్ పంజాల్, అటవీ ప్రాంతాన్ని అణువణువునా శోధించాలని నిర్ణయించారు. ఈ ఆపరేషన్ నేడో రేపో ప్రారంభం కానుంది.
రాజౌరీ నుంచి కుప్వారా వరకు ప్రస్తుతం కూంబింగ్ చేపట్టారు. సరిహద్దు ప్రాంతమైన హిల్ కాకా నుంచి ఉగ్రవాదులు చొరబడేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రాంతాన్ని భారత ప్రభుత్వం పూర్తిగా మూసివేసింది.
వీరి చర్యలను భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయి. మరోవైపు పంజాబ్ లోని పఠాన్ కోట్ ఫాంగ్ టోలీ సమీపంలో ఏడుగురు అనుమానితులను గుర్తించి వారి కోసం వేట కొనసాగిస్తున్నారు. వీరి స్కెచ్ లను కూడా విడుదల చేశారు.పూంచ్ లో అణువణువూ శోధించే ఆపరేషన్ ను చేపట్టారు.
త్వరలో జరగనున్న జమ్మూకాశ్మీర్ ఎన్నికలను భగ్నం చేయాలనే వీరి ముఖ్యోద్దేశ్యమని ఇంటలిజెన్స్ వర్గాల సమాచారం. ఈసారి నిర్వహించబోయే ఆపరేషన్ లో స్థానికులను పూర్తి భాగస్వామ్యం చేసే దిశగా ఆర్మీ, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. స్థానికులు అప్రమత్తమైతే ఉగ్రవాదుల కదలికలు పూర్తిగా పసిగట్టనున్నారు. మరోవైపు ఇప్పటికే సరిహద్దు గ్రామాల్లోని చాలామంది స్థానికులను ఈ ఆపరేషన్ లో భాగస్వాములను చేసినట్లుగా సమాచారం.
కేంద్ర భద్రత బలగాలు ఇటీవలే పలువురు స్లీపర్ సెల్స్, ఉగ్రవాదులకు సహాయం చేసే స్థానిక గైడ్స్ ను అదుపులోకి తీసుకున్నాయి. వీరి ద్వారా ఉగ్రవాదుల పూర్తి సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. ఉగ్రవాదుల వద్ద ఏకే 47, ఎం 4, చైనీస్ పిస్టల్, స్టీల్ బుల్లెట్లు, గ్రెనేడ్, బాడీ కెమెరా శాటిలైట్ మొబైల్ ఫోన్ లు ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈ ఆయుధ డంప్ లను పీర్ పంజాల్ లోని పర్వత పంక్తులు, అటవీ ప్రాంతంలో డంప్ చేస్తున్నట్లుగా గుర్తించారు.
మెరుపు దాడులతోనే ఉగ్రవాదుల ఆటకట్టించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఓ వైపు దృష్టి సారిస్తూ మరోవైపు దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదులకు వారి పంథాలోనే జవాబు చెప్పాలని నిర్ణయించారు. ఈ ఆపరేషన్ పేరు తదితర వివరాలు పూర్తిగా బయటికి పొక్కకపోయినా త్వరలోనే గతంలో జరిగిన సర్జికల్ స్ర్టైక్ మాదిరే ఉగ్రవాదులపై భారత్ విజృంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.